Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Thursday, 30 April 2015

నేను శతృవునే

నేను శతృవునేనేను శతృవుని ఎలా అయ్యాను
ఏ కోణంలో నేను విరోధినయ్యాను...
ఏ విధమైన పాపంలో పాలు పంచుకున్నాను...
నేనెప్పుడూ కుట్రలు చేయలేదు
మైండ్ మాట ఎన్నడూ వినలేదు...
చెవిలో ఇల్లు కట్టుకున్న వారిని ఎన్నడూ నమ్మలేదు
మనసు చెప్పిందే విన్నా
మనసు చెప్పిందే చేశా ...
నేనెప్పుడూ మోసం చేయలేదు
నేనెప్పుడూ పారిపోలేదు...
సమస్యలతో సమరమే నాజీవితం
అలుపెరుగని పోరాటమే నా లక్ష్యం ...
మనసు మాట కాదనక
ముళ్ళ బాటనే పూల బాటనుకున్నా...
ఒక్కొక్కటి జారిపోతున్నా
మనసునే నమ్ముకున్నా ...
పోరుబాటలో అలసిన మనసు
మనసునే ప్రశ్నిస్తే ...
ఈటెల వంటి మాటలకు
సమాధానాలే ఇస్తే
అదే పాపమయ్యింది...
నిగ్గదీసి నిలదీస్తే
అదే నేరమయ్యింది...
సమాజమా నేను శతృవునే
ఆ మనసుకు నేను విరోధినే
ఆ మనసు మాత్రం నాకు ప్రియమైనదే...

గాయపడుతున్న అక్షరం

గాయపడుతున్న అక్షరం

నీ కన్నుల వెన్నెలలో ఆడుకున్నాయి నా అక్షరాలు
నీ పెదాల మెరుపులను తమ ఒంటికి అద్దుకున్నాయి నా అక్షరాలు
నీ మాటల మతలబులో స్నానమాడాయి నా అక్షరాలు
నీ మనసులో మాధుర్యానికి భాష్యం పలికాయి నా అక్షరాలు
నీ కంటిపాప వెలుతురులో కాగడాలుగా నిలిచాయి నా అక్షరాలు
నీ చూపు పడితే చాలు పులకరించాయి నా అక్షరాలు
ఎంతమనసైన భావమని నువ్వంటే నింగిని గెలిచాయి నా అక్షరాలు
ప్రతి నిత్యం నీ స్పర్శకు తహతహలాడాయి నా అక్షరాలు
ఇప్పుడూ నా అక్షరాలను తాకుతున్నావు
అక్షర గుండియలను తడుముతున్నావు
ప్రతి అక్షరంలో ఇప్పుడు నీకు కొత్త అర్థమే దొరుకుతోంది
ప్రతిభావంలో నీకు విపరీతమే కనిపిస్తోంది
పువ్వులాంటి అక్షరంపై ఈటెల మాటలను సంధిస్తూ
అక్షర సమరం చేస్తున్నావు
పనికిరానివారితో పనేమిటని
యూజ్ లెస్ బిరుదాంకితం చేసావు
నాడున్నది నేడు ఏది మాయమయ్యింది నా అక్షరంలో
ఓసి సమాజమా
చూడకు నా అక్షరాన్ని
నీ చూపుల కరకుదనంలో అక్షరపుష్పాల
గాయాలు మళ్ళీ నిద్దుర లేస్తున్నాయి

Wednesday, 29 April 2015

ఎక్కడా నీ చిరునామా...

ఎక్కడా నీ చిరునామా...అన్నదమ్ముల అనుబంధంలో చూసాను
ప్రతి గుండెను తట్టి చూసాను
ఏ గుండెలోనూ కానరాలేదు...
ఎవరి లెక్కలు వారివి
ఎవరిప్రయోజనం వారిది...
కిందపడిన వాడికి చేయూతనిస్తే
మనకు మిగిలేది ఏమనే ప్రశ్నలు...
భార్యా భర్తల అనురాగంలో పరికించి చూసాను
నిశి రాతిరి అనుబంధాన్ని కదిలించాను...
చిరునవ్వుల మెరుపుల్లో వెతికాను
నువ్వులేక నేను లేను అన్న బాసలలో శోధించాను
అక్కడా కానరాలేదు ...
మాటల్లో డొల్లతనమే
పలుకుల్లో మాయాజాలమే
రాజీ పడుతున్న జీవన సమరాలే...
బంధువులనే మనుషుల గూడారాల్లో తొంగి చూసాను
నలువైపులా కాచుకుని ఉన్న రాబందులే ...
రాబందుల మాటల్లోనూ అన్వేషించాను
ఎక్కడా కనిపించలేదు...
అసలు నువ్వు ఎక్కడున్నావు
నీరూపమేమిటి
ఎలా ఉంటావు నీవు ...
అనుబంధాల ముసుగులో దాగున్నావా
ఆవేశం అంచులలో జారిపోయావా ...
అనుమానాల చీకటిలో దాగి ఉన్నావా
మాయాలోకపు పలుకుల్లో కరిగిపోయావా ...
అసలు ఎక్కడున్నావు
ఒక్కసారి చెప్పవా
ఓ ప్రేమా ఎక్కడ
నీ చిరునామా...

Tuesday, 28 April 2015

మనసా నీకు వందనం

మనసా నీకు వందనంఏదీ జరగలేదు
అమృత వర్షం కురవనే లేదు...
వాడిన వసంతం వికసించలేదు
ఎండిన చెట్లలో మారాకు మొగ్గ తొడగలేదు...
ఎండమావులేవీ నీటిచెలమలుగా
మారనే లేదు ...
కక్ష గట్టిన సమాజం
స్నేహహస్తం చాచలేదు...
రాబందు బంధువులు
కోయిల పాట పాడనే లేదు...
కుప్పకూలిన శిఖరం
తల ఎత్తనే లేదు...
మనసు కొలనులో
సునామీ ఆగనే లేదు...
అదే వేదన
అదే రోదన...
అదే గుండె కోత
ఆగని ఆకలి మంట...
దైనందిక పయనం
రోజూవారి సమరం
జీవనం మారనే లేదు...
ఏదీ జరగలేదు
ఏదీ నిజం కాలేదు...
మనసును వీడి
మనసు పయనమైతే
మార్పులు వస్తాయని చెప్పినది
ఏదీ నిజం కాలేదు...
కాలం మారదనీ
కొత్తవి ఏవీ పుట్టుకు రావనీ
మనసుకు బాగా తెలుసు...
పోయినదేదీ రాదనీ
బతుకు సమరం తప్పదనీ తెలుసు...
ఎవరున్నా లేకున్నా
వాడిన పద్మం ఏనాటికీ వికసించదని తెలుసు...
అందుకే చెబుతున్నా చివరి మాటగా
మనసు చెప్పింది ఏదీ జరగదు...
ఓసి మనసా
నీకు వందనం...

Monday, 27 April 2015

అస్త్ర సన్యాసం

అస్త్ర సన్యాసం


ఎవరితో పోరాటం
ఎందుకు ఈ చెలగాటం ...
నేను చెయ్యను పోరాటం
నాకు లేదు ఆరాటం ...
మనసైన నా మనసు
మనసుతోనే పోరాటం చేస్తుందా...
ఇది నా మనసు
ఇది నా సర్వస్వం
ఇదే నాజీవితమని
చెప్పుకున్న మనసు
మళ్ళీ మన్సుతోనే పోరాడుతుందా...
రగులుతున్న ఆ మనసూ నాదే
ఆ వేదనకు కారణమూ నేనే
ఎలా పోరాడుతుంది మనసు....
ఎందుకు పోరాడాలి
ఎవరితో పోరాడాలి...
చెయ్యి విడిచింది  మనసు
మరో మనసుకోసమే నంటూ
గేలి చేసే లోకంతో పోరాడాలా...
ఆ మనసు మరో మనసు
నీడన చేరాలని తపిస్తే
ఈ మనసు ఆపగలదా...
మనసులను కట్టడి చేసే
మనుషులున్నారా లోకంలో...
మరెందుకు సమరం
ఎందుకు అర్థం లేని పోరాటం...
విరిగిన మనసు ముక్కలను
అతికించాలనుకునే సమాజాన్ని కాదు నేను...
పగిలిన మనసుకు
ఈ మనసులో స్వాంతన లేదని తెలుసు నాకు...
ఆ మనసు విజయమే
ఈ మనసుకు ఆనందం ...
ఆ మనసుకు మనసైన
స్వాంతన దొరకాలనే ఈ మనసు ఆరాటం...
అందుకే ఏనాటికీ చేయదు
ఈ మనసు పోరాటం...
మనసైన మనసుకోసం చేస్తోంది
ఈ మనసు అస్త్ర సన్యాసం...

Sunday, 26 April 2015

నీ నగరిలో అనామకుడిని

నీ నగరిలో అనామకుడినిఆకాశమంతటి నీ మనసులో
విహంగమై విహరించాను...
నీ కన్నుల వెన్నెలలో
జాబిలినై వెలిగాను...
నీ పెదాల మధురిమలో
మెరుపుతీగనై మెరిసాను...
విధి ఆడిన చదరంగంలో
అందరున్నా ఒంటరినయ్యాను...
నీ మనసులో విహంగమైన నేను
నీ నగరిలో అనామకుడినయ్యాను...
నీ వీధిలో నా కన్నులు
నిత్యం నిన్నే శోధిస్తున్నాయి...
నీవు నడియాడే వీధిలో
నాకళ్ళు ఎండమావులవుతున్నాయి ...
ఎదురుగా వస్తావా
పక్క వీధిలో ఉన్నావా
ఎండిపోయిన నయనాలు
ఆర్తిగా చూస్తున్నాయి...
నేను రోజూ నడిచిన మార్గమే
ఎందుకలా అయ్యావని నన్ను ప్రశ్నిస్తోంది...
నిత్యం నన్ను పలకరించిన వీధే
నన్ను చూసి చిన్నబోతోంది ...
నీ ఇంట్లో వెలుగుతున్న దీపం
నీ వెన్నెల ఏదని వెక్కిరిస్తోంది...
మన కలయిక లేదని తెలుసు
అది ఇక కలయేనని తెలుసు...
తనది అనే లోకం వీడి
పరాయి ప్రపంచం పంచన చేరిన మనసు
ఎన్నటికీ మనసును చేరదు...
నా మనసుకూ తెలుసు
ఇక మనసు లేదనీ
అది తిరిగి రాదనీ...
అయినా నీ నగరిలో
దారితప్పిన బాటసారిలా
నా అడుగులు పడుతూనే ఉంటాయి...
నువ్వు చూడవనీ
చూసినా చూపు తిప్పుకుంటావనీ
నా మనసుకు తెలుసు...
నువ్వు తిరిగి రాకున్నా
నీ రూపం కనిపిస్తే చాలు
ఎండమావులైన నా కన్నులు
కన్నీటి చెలమలుగా మారిపోతాయి...

Saturday, 25 April 2015

పాపం... ఆ కత్తి ఏం చేసింది...

పాపం... ఆ కత్తి ఏం చేసింది...మైనే పూఛా ఖంజర్ సే ముఝే కిస్ లియే మారా
ఖంజర్ నే కహా పాగల్ తుజే మైనే నహీ మారా
వో తో తేరా దిల్ థా... కామ్ తమామ్ కర్ దియా ...

మెల్లగా కళ్ళు తెరిచి చూశాను
అంతా కొత్తగా వింతగా ఉంది...

దేహం తేలికగా అనిపించింది
అసలు బరువే లేనట్టుంది...

ఆశ్చర్యంగా ఉంది
నేను గురుత్వాకర్షణ శక్తిని కోల్పోయానా...

గాలిలో తేలిపోతున్నట్టుగా
లేచి కూర్చున్నా...

లయా భ్రాంతియా
నేను లేచి కూర్చున్నా గానీ
నాదేహం అక్కడే పడుకుని ఉంది...

అప్పుడు తెలిసింది నాకు
నేను చనిపోయానని
లేదు లేదు నన్ను ఎవరో చంపేశారని...

నా చాతీ మీద పెద్ద రంద్రం లాంటి గాయం
పక్కనే పడి ఉన్న నెత్తురు ఆరని కరవాలం...

కోపం తట్టుకోలేని నేను
ఆ కత్తిపై అరిచాను
నన్నెందుకు పొడిచావనీ...

కరవాలం ఫక్కున నవ్వింది
అమాయకుడా జీవమే లేని నేను
నిన్నెలా పొడుస్తాను అంటూ...

కదిలే సత్తువ లేని నేను
నిన్నెలా అంతం చేయగలను...

సముద్రంలా ఎగసిపడే నీ హృదయాన్ని
తాకే నిబ్బరం నాకుందా...

పిచ్చివాడా నిజం తెలుసుకో
నీ మనసే నిన్ను చంపేసిందంటూ జాలి పడింది...

తడి ఆరుతున్న రుధిరాన్ని తుడుచుకోవాలంటూ
ఆ కత్తి మాయమయ్యింది...

ఆ కరవాలం తప్పేముంది
నన్నెవరు మాత్రం ఏం చెయ్యగలరు ...

నా మనసే నన్ను అంతం చేస్తే
ఇంకేం చెయ్యగలను
మృత్యుదేవత ఒడిలో
కరిగిపోవటం తప్ప....

Friday, 24 April 2015

డైరీలో తెల్ల పేజీలు

డైరీలో తెల్ల పేజీలు


గతించిన కాలం
తాను వెళ్ళిపోతూ
జ్ఞాపకాలను నాపై విసిరేస్తే ...
ఒక్కసారి గతంలోకి
వెళ్లాలనీ
నాటి స్మృతులను ఒక్కసారి
తడుముకోవాలనీ
నా అనుభవాల డైరీ  విప్పిచూసా...
డైరీలో ప్రతి పేజీని తిప్పాలని
ఆరాటపడ్డా...
ఆశ్చర్యం
వందలపేజీలు
ఖాళీగా కనిపించాయి...
మళ్ళీ మళ్ళీ తిప్పి చూసా
తెల్ల కాగితాలు నవ్వుతూ వెక్కిరించాయి..
ఏమైపోయాయి
నేను చెక్కుకున్న అక్షరాలు...
ఎలా మాయమయ్యాయి
నేను దాచుకున్న అనుభవాలు...
మకరందం తాగేసిన సీతాకోకచిలుకల్లా
నా అనుభాల అక్షరాలు ఎగిరిపోయాయా...
ఎందుకు శూన్యం
నన్ను వెక్కిరిస్తోంది...
ఎందుకు  వాడిపోయాయి
నేను పదిలంగా దాచుకున్న
జ్ఞాపకాల పుష్పాలు ...
నేను రాసుకున్న అక్షరాల్లో లోపమా
నేను వాడిన కలం ఒక శిలాజమా ...
డైరీలో అక్షరాలు మాయం కావచ్చు
తెల్లకాగితాలు దయ్యాల్లా బెదిరించవచ్చు...
ఆ డైరీ ఒక శూన్యపుస్తకమే కావచ్చు
కాలగమనంలో అది శిథిలమే కావచ్చు...
గుండె గుడి గోడలపై
రాసుకున్న రుధిరాక్షరాలు
నా అనుభవాల పరంపరలై
నిత్యం నన్ను ముద్దాడవా...
నా రుధిరంలో కణాలుగా మారిన
అనుభవాలను చెరిపేసే దమ్ము
ఎవరికైనా ఉందా...

కరిగిపోకు ఓ స్వప్నమా

కరిగిపోకు ఓ స్వప్నమా

అందమైన ఊహవు నీవు
ఎన్నటికీ నిజం కాకు ...
మెదడులోని భ్రాంతివి నీవు
నిజమై నా ముందుకు రాకు ...
పువ్వులోని మెరుపువు నీవు
నిశి వైపు అడుగులు వెయ్యకు...
నెలవంకలోని వెన్నెలవు నీవు
ఎండమావిలో కలిసిపోకు...
నా శ్వాసలోని ఊపిరి నువ్వు
శ్వాస నింపుకుని భువికి దిగిరాకు...
నిన్ను నిత్యం ఆరాధిస్తా నేను
ప్రేమమయివై నా వైపు రాకు...
నా కన్నులలో వెలుగువు నీవు
నా వెలుగుకై నువ్వు వెలగకు ...
కనురెప్పల స్వప్నం నీవు
నా కంటి తెరను వదిలి రాకు...
కంటి తెరలోని కలగా
ఊహలో సుందరిగా
భావలోకంలో నాయికగా
మనసుగుడిలో దేవతగా
అక్కడే కొలువై ఉండిపో...
నిజమై నువ్వొస్తే
కసికాలపు ఆటలలో
మనుషులు ఆడే చదరంగంలో
అంతులేని ఆవేశంలో
నువ్వుకూడా రగిలిపోయి
కరిగిపోతావేమో....
అందుకే నీవు
ఊహా సుందరిగానే మిగిలిపో
మనస్వినీ