Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 3 September 2015

ఎవరిపై నీ జిహాద్ ?

ఎవరిపై నీ జిహాద్ ?

మండుతున్న అగ్ని శిఖవు నీవు
ఎగసిపడే కడలి కెరటం నీవు
కొండను పిండి చేసే బలానివి నీవు
జలపాతాన్ని దోసిటపట్టే తెగువవు నీవు
ధైర్యానికే నడకలు నేర్పే అడుగుజాడవు నీవు
అద్భుతాలు సృష్టించే జ్ఞాన సంపద నీవు
సాంకేతికతకు పరుగులు నేర్పే గమ్యం నీవు
ఇంజనీరు నీవు
కంప్యూటర్ తీగలో ప్రవాహం నీవు
మేధావివి నీవు
బోధకుడివి నీవు
శిక్షకుడివి నీవు
నీ లక్ష్యం మంచిదే
నీ గమ్యం మంచిదే
మతంపై నీ ఆరాధన భావ్యమే
జాతిపై నీ అభిమానం కాదనలేనిదే
మతాన్ని ఉద్ధరించే దిశలో
జాతి ప్రగతిలో
జిహాద్ కావాల్సిందే
నీవు జిహాద్ చేయాల్సిందే
కానీ ఎవరిపై నీ జిహాద్
ఎవరిని ఉద్ధరిస్తోంది నీ జిహాద్
ఎప్పుడో నాగరికత తెలియని దశలో
రాసుకున్న జిహాద్
ఇప్పుడు నీ చేతిలో
కాదు కాదు
పిచ్చోడి చేతిలో రాయిగా మారింది
నీవు జిహాద్ చెయ్
ఎవరిపైనో తెలుసా
నీ అసలు గమ్యం తెలుసా
అసలు లక్ష్యం తెలుసా
నవమాసాలూ మోసి నిన్ను కన్నతల్లి
కంట కన్నీరు తుడిచేందుకు జిహాద్ కావాలి
వయసు పైబడుతున్నా
పరిణయభాగ్యం లేని నీ సోదరి
కష్టం తీర్చేందుకు జిహాద్ చేయాలి
చదువు సంధ్యలు లేక
అక్షర విహీనులైన నీ సోదరులకు
విద్యాబుద్ధులు చెప్పేందుకు జిహాద్ చేయాలి
వయోభారంలోనూ రిక్షా లాగుతూ
ఎముకలగూడులా మారిన
ఎందరో అభాగ్యుల జీవితాలకు
కాసింత సహారా రూపంలో జిహాద్ కావాలి
ఎండిన డొక్కల్లో ఆర్తనాదాలు ఆపేందుకు
పూరించే సమర శంఖమే నీ జిహాద్ కావాలి
మురికివాడల్లోబురద పురుగులుగా
కంపుకొడుతున్న నీ జాతి జనుల ఉద్ధరణకు
జిహాద్ చేయాలి
మతం కోసమే మేము మేమంటేనే మతమని అంటూ
విద్వేషాల మొక్కలు నాటుతున్న
పెద్దమనుషుల ఆటకట్టుకు జిహాద్ చేయాలి
మతం ఆరాధన తుపాకిలో లేదు
జాతి ఉద్ధరణ బాంబుల్లో లేదు
నీ మెదడులో ఉంది
నీ ఆలోచనల్లో ఉంది
నీ నడకలో ఉంది
నీ నడతలో ఉంది
జాతి సంరక్షణకు ఎక్కడికో వెళ్లి
కుక్క చావు చస్తే లక్ష్యం నెరవేరుతుందా
మతం తారాజువ్వలా వెలిగిపోతుందా
మతం గుండెలో బాంబులు పెట్టి
ఉగ్రవాద జాతిలా మార్చే ప్రయత్నం చేయకు
జాతి గుండెలో అభివృద్ధి ఫలాలు నింపు
నువ్వు చెబుతున్నదంతా నిజం కాదు
ఏవో కొన్ని మూకల పరివారం వికృతాలు తప్ప
నీ జాతికి వచ్చిన ముప్పేమీ లేదు
దాడికి ఎదురుదాడి చెయ్
ప్రజాస్వామ్య విలువల్లో
చట్టబద్ధమైన మార్గంలో జిహాద్ చెయ్
సర్వ మతాల నిలయమైన భారత భూమిలో
మతాభిమానం చాటి చెప్పు
మతాన్ని కాపాడు
అన్ని మతాలూ అండగా నిలుస్తాయ్
నీ లాంటి గుప్పెడు మంది అన్ని మతాల్లోనూ ఉన్నారు
నీ మార్గం మాత్రం ఇది కాదు
నిజంగా నీ జాతికోసం
మరణించాలని నీకుంటే
జనజీవన స్రవంతిలో పోరాడు
ఎదుటివాడిని ప్రశ్నించే ముందు
నిన్ను నీవు ప్రశ్నించుకో
నీ జాతికి నువ్వేం చేయాలో తెలుస్తుంది
దారిద్ర్య రేఖకు దిగువన
పాతాళంలో కూరుకుపోయిన
నీ సోదరులకు చేయూతనిచ్చి
పైకి లాగేందుకు
నడుం బిగించు
ప్రతి ముస్లిం కళ్ళలో వెలుగులు నింపేందుకు
నీవే కొవ్వొత్తిలా కరిగిపో
నీకు మరో జిహాద్ అవసరమే ఉండదు

No comments:

Post a Comment