Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 16 July 2020

లెక్చరర్ నే కానీ పాఠాలు చెప్పలేదు(PART-8)


లెక్చరర్ నే కానీ
పాఠాలు చెప్పలేదు(PART-8)

నా జర్నలిజం ప్రస్థానంలో ఒక కీలక మలుపు గోవింద్ రెడ్డి గారి వల్ల వచ్చింది. అవి నేను జీ 24 గంటలు ఛానల్ లో క్రైమ్ బ్యూరో చీఫ్ గా పని చేస్తున్న రోజులు. గోవింద్ రెడ్డిగారు మాకు ఇన్ పుట్ ఎడిటర్. మాది ఈనాడు నాటి అనుబంధం కాబట్టి నాతో చాలా ఆత్మీయంగా ఉండే వారు. కొంతమంది ప్రముఖ ఐపీఎస్ అధికారులతో నాకు సాన్నిహిత్యం ఏర్పడిందంటే దానికి గోవిందన్నయే కారణం.. సరే అసలు విషయానికి వద్దాం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రెస్ అకాడమీ తరచుగా జిల్లాల్లోని జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించేది. గోవిందన్న ఈ తరగతులకు హాజరైన క్లాసు తీసుకునేవారు. ఒకసారి ఆయన క్లాసుకు వెళ్లలేని పరిస్థితి.. చాలా బిజీగా ఉన్నారు. క్లాస్ ను మిస్ చేయడం ఆయనకు ఇష్టం లేదు. ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడే నేను ఏదో పని మీద ఆయన క్యాబిన్ లోకి వెళ్ళా.. ఏందన్నా సీరియస్ గా ఆలోచిస్తున్నావని అడిగా. ఏం లేదు గౌస్ ప్రెస్ అకాడమీ క్లాసు ఉంది నువ్వు వెళతావా అని అడిగారు. నేను షాక్ నేనేంటి జర్నలిస్టులకు క్లాస్ తీసుకోవడమేంటి కష్టమన్నా అని అన్నా.. ఏం కాదులే గౌస్.. నేను నీకు చెబుతా కదా అని ధైర్యం చెప్పారు.. మరో మూడు రోజుల్లో ఒంగోలు వెళ్ళాలి. నాకేమో భయంగా ఉంది. ఎంతమంది ఉంటారో నేను వాళ్లకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అనే టెన్షన్ తో నిద్రకూడా పట్టేది కాదు. గోవిందన్న తన క్యాబిన్ లోకి పిలిచి రేపే నీ ప్రయాణం ఫలానా వాళ్లు నీకు రైల్వే స్టేషన్ లో కలుస్తారు. అక్కడ నిన్ను అకాడమీ స్టాఫ్ పికప్ చేసుకుంటారు అని చెబుతూ క్రైమ్ కు సంబంధించి క్లాస్ ఉంటుంది అంటూ కొన్ని మెళకువలు చెబితే నోట్ చేసుకున్నా. ఐపీసీ పీనల్ కోడ్ కు సంబంధించి ఒక బుక్ చేతిలో పెట్టారు. అక్కడనుంచి స్టార్ట్ అయ్యాయి నా జిల్లా పర్యటనలు. సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ తో పాటు పలువురు ప్రముఖ జర్నలిస్టులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వంటి వారితో జర్నీ చేస్తూ జిల్లాల్లో జర్నలిస్టులకు క్లాసులు చెప్పేవాడిని. అయితే ఇక్కడ నాకు ఐపీసీ సెక్షన్లు క్రైమ్ మెళకువల చిట్టా ఏదీ పనికి రాలేదు. అదెలాగంటే ఒక అనుభవం చెబుతా. అది నా రెండవ జిల్లా పర్యటన.. శిక్షణా తరగతుల్లో భాగంగా ఒక సీనియర్ జర్మలిస్టు చాలా పెద్దాయన క్లాస్ నడుస్తోంది. వేదికపై నేనూ ఉన్నా.. అప్పటికే కొంచెం ధైర్యం వచ్చేసింది. ఆయన ఉపన్యాసం నడుస్తోంది. తెలుగు భాష జర్నలిజంలో వాడాల్సిన పదాలు సంధులు దీర్ఘాలు అంటూ అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ వైపు చూస్తే అంతా అసహనంగా ఉన్నట్టు కనిపించింది. కొంతమంది లేచి బయటకు వెళ్లి టీ సిగరెట్లతో కాలక్షేపం చేస్తున్నారు. అప్పుడనిపించింది నాకు ఈ జర్నలిస్టులకు ఏదో కొత్తగా చెప్పాలని. నా వంతు వచ్చింది. సగం మంది ఇంక హాల్ బయటే ఉన్నారు. డయాస్ పైనుండి మైకులో నేను చెప్పింది ఒకటే ఫ్రెండ్స్ నేను క్లాస్ తీసుకుని మీకు బోర్ కొట్టించడానికి రాలేదు. సరదాగా మాట్లాడుకుందాం లోపలికి రండి అంటూ ఆహ్వానించాను. కొంతమంది వచ్చారు, కొంతమంది బయటే ఉన్నారు. ఓ పది నిమిషాలపాటు పరిచయ కార్యక్రమం పెట్టుకున్నా. అందరూ తమతమ వివరాలు చెప్పారు. నేను మాట్లాడుతున్నా మధ్య మధ్యలో వాళ్ళూ కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. నాకిచ్చిన గంట సమయం ఎప్పుడో దాటి పోయింది. నిర్వాహకులు చీటీ పంపి హెచ్చరించేసరికి నా క్లాసు సమయం గంటా నలభై నిమిషాలు దాటింది. వాళ్లకు నేను పుస్తకాల మ్యాటర్ చెప్పలేదు ఐపీసీ సెక్షన్లు చెప్పలేదు.. జస్ట్ వారి క్రైమ్ రిపోర్టింగ్ లో నా అనుభవాలు చెబుతూ వారి అనుభవాలు వింటూ క్లాస్ పూర్తి చేసాను. అప్పుడు ఆడియన్స్ వైపు చూస్తే హాల్ నిండిపోయి ఉంది. అప్పటి నుంచి ఏ జిల్లాకు వెళ్లినా ఇదే శైలితో నా క్లాస్ నడిచేది. జిల్లా రిపోర్టర్లు గ్రామీణ విలేకరులు క్లాస్ అనంతరం నన్ను కలిసి నా ఫోన్ నంబర్ అడిగి తీసుకుని సూపర్ సార్ మాకు క్లాస్ బాగా నచ్చింది అని అంటుంటే తృప్తిగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా చీలిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ క్లాసులు కొనసాగాయి కానీ నా ప్రయాణం ఆగిపోయింది. బహుషా తెరాస భావజాలం లేకపోవడం కారణం కావచ్చు, తెలంగాణా అకాడమీ అధికారులు నా విషయంలో ధైర్యం చేయలేకపోయారు. కానీ నా జిల్లా పర్యటనలు అన్నీ నాకు మధురానుభవాలే. స్థానిక మిత్రులు చూపిన ప్రేమాభిమానాలు చివరి క్షణం వరకు మరిచిపోలేను. ఆ జ్ఞాపికలు, ప్రశంసలు, సన్మానాలు నా జర్నలిజం కెరీర్ లో తీపి గుర్తులే... ఇప్పటికీ క్లాసులు జరుగుతున్నాయి కానీ ఒక విషయం అందరు గుర్తుంచుకోవాలి. గ్రామీణ విలేఖరుల్లో తోపులున్నారు, మంచి అక్షరజ్ఞానం ఉన్నవాళ్లు ఉన్నారు వారికి నేర్పాల్సింది అక్షరాలు సంధులు దీర్ఘాలు కాదు. వారి అనుభవాలు సమస్యలు తెలుసుకుని పరిష్కారాలు చూపగలిగితే చాలు. మిగతాది వాళ్లే చూసుకుంటారు...నేను క్లాసులకు లెక్చరర్ గానే వెళ్లినా వారికి పాఠాలు చెప్పలేదు. నా అనుభవాలు పంచుతూ వారి అనుభవాలు తెలుసుకుంటూ చాలా నేర్చుకున్నా... ఒక రకంగా వారందరికీ రుణపడి ఉన్నా అని చెప్పుకోవచ్చు.

3 comments:

  1. >> నా అనుభవాలు పంచుతూ వారి అనుభవాలు తెలుసుకుంటూ చాలా నేర్చుకున్నా.
    అన్ని పాఠాలకూ ముడిసరుకు అనుభవాల నుండీ అనుభూతులనుండే‌ కదా వచ్చేది. అవి పంచుకున్న కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది. మీరు చేసినది మంచిపని. చాలా మంచి పని.

    ReplyDelete
  2. ధన్యవాదములు అండీ

    ReplyDelete
  3. ధన్యవాదములు అండీ

    ReplyDelete