Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 18 July 2020

నేనెలా ముస్లిం వ్యతిరేకినయ్యాను(PART-10)


నేనెలా ముస్లిం వ్యతిరేకినయ్యాను(PART-10)


నా కెరీర్ లో నన్ను చాలా కాలం ముస్లిం వ్యతిరేక ముద్ర వెంటాడింది. కొందరైతే నువ్వేం ముస్లింవి అని మొహం మీదే అనేసేవారు. కొంచెం ఇబ్బందిగానే ఉండేది బంధువులు కూడా ఎందుకు ముస్లిమ్స్ తో పెట్టుకుంటావు ఎంతయినా మనోళ్లే కదా అని అనేవారు. ఇక ఉర్దూ మీడియాలో కొందరైతే నాతో మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. ఒక రకంగా ఆ సమయంలో నేను వివక్షతకు గురయ్యాననే చెప్పవచ్చు.. ఇలా ఎందుకు జరిగింది అసలు కథేంటి అంటే నేనూ నా వైఖరే దీనికి కారణం అని చెప్పొచ్చు...
అప్పట్లో నేను సిటీ కేబుల్ లో ఉన్నప్పుడు మక్కామసీదు దగ్గర మతకలహాలను మా ఛానల్ ఎక్స్ క్లూజివ్ గా లైవ్ ఇవ్వడం ఇది వరకే చెప్పాను. అక్కడ గొడవలు జరుగుతాయనే విషయం నాకు ముందే తెలియడం సిటీ కేబుల్ లైవ్ ఇవ్వడం కూడా చెప్పాను. నిజానికి ఆరోజు గొడవల కవరేజికి నేను వెళ్ళలేదు. నాకు బాగా జ్వరంగా ఉండటంతో ఆఫీసులోనే ఉండిపోయాను. మా కొలీగ్ హరిప్రసాద్ ( ఇప్పుడు tv 9) ఆరోజు కవరేజికి వెళ్లారు. అనుకున్నట్టే భారీ గొడవలు, సిటీకేబుల్ లైవ్ అన్నీ జరిగిపోయాయి. అయితే ఈ విషయం సిటీకేబుల్ కు ముందే ఎలా తెలుసు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ముస్లిం సంఘాలు సిటీ కేబుల్ మీద కారాలు మిరియాలు నూరడం మొదలయ్యింది. దీనికి తోడు మా ఆఫీసునుండి వీడియో ఫుటేజీ పోలీసులకు అందింది. దాని ఆధారంగా పోలీసులు నలభై మంది సిమీ కార్యకర్తలను అరెస్టు చేశారు. పనిలో పనిగా మనపేరూ బయటకు పొక్కింది. అప్పటినుంచి మొదలయ్యాయి కష్టాలు. అప్పుడే సిమీ హిట్ లిస్టులో మనపేరు సువర్ణాక్షరాలతో నమోదయ్యిందన్నమాట. మక్కామసీదు గొడవలపై మౌనంగా ఉన్న మజ్లిస్ పార్టీ ఆశ్చర్యకరంగా సిటీ కేబుల్ పై ఆరోపణలు కురిపించింది. మజ్లిస్ శాసన సభ్యులు ఏకంగా దారుస్సలాం లో ప్రెస్ మీట్ పెట్టి గొడవలకు సిటీకేబుల్ మాత్రమే కారణమని ఆరోపించారు. సిటీ కేబుల్ సిబ్బంది ఆందోళనకారులకు రాళ్లు కత్తులు అందించి హింసకు ఉసిగొల్పారని దుయ్యబట్టారు. ఆ ప్రెస్ మీట్ లో సయ్యద్ సజ్జాద్ కూడా ఆలా మాట్లాడటం నాకు బాధ కలిగించింది. ఎందుకంటే ఆయనతో నాకు అప్పట్లో మంచి సంబంధాలు ఉండేవి. ఓల్డ్ సిటీలో సిటీ కేబుల్ అంటే నేను మాత్రమే అని అందరికీ తెలుసు. ఇలా మనం అందరికీ టార్గెట్ అయ్యాం. తరువాత సిమీ గ్రూప్ వాళ్ళు నాపై రెండు సార్లు హత్యాయత్నం చేయడం జరిగింది.ఈ సమయంలో ముస్లిం సంఘాలతో రాజీ కుదుర్చాలని నా శ్రేయోభిలాషులు చాలా ట్రై చేశారు. కాలం గడిచింది నేను ఎవరితో రాజీ పడలేదు. సిమీ ని ప్రభుత్వం తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధం విధించటం, ఎన్ కౌంటర్లతో ఆ సంస్థ బలహీన పడటం జరిగింది. అయితే నాపై పడిన ముస్లిం వ్యతిరేక ముద్ర మాత్రం నన్ను బాధిస్తూనే ఉంది. ముఖ్యంగా నాపై దాడులు జరిగినప్పుడు బండారు దత్తాత్రేయ వంటి ప్రముఖులు నాకు అనుకూలంగా మాట్లాడటం కూడా అగ్నికి ఆజ్యంలా తోడయ్యింది. ఈ సమయంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నాకు బాగా అండగా నిలిచింది. నాపై జరిగిన దాడి నేపథ్యంలో మీడియా నాయకులతో చర్చల సందర్భంగా అప్పటి హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ నాకు గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పిస్తానని అంటే నేను వద్దని తిరస్కరించాను.
కాలం అలా గడుస్తూనే ఉంది. రెండుసార్లు మృత్యు వు దగ్గరికి వెళ్ళివచ్చినా మన బుద్ధి మారలేదు. సిటీ కేబుల్ నుంచి జెమినికి వెళ్లినా నేను ఓల్డ్ సిటీని మరిచిపోలేదు. ఏదో ఒక వివాదాస్పద స్టోరీ చేస్తూనే ఉన్నా. ముఖ్యంగా చారిత్రక మక్కా మసీదును అల్లర్లకోసం ముష్కరులు వాడుకోవటాన్ని నిరసిస్తూ అనేక స్పెషల్ స్టోరీలు చేసాను. ఒక దశలో డీజేఎస్ అద్యక్షుడు మహబూబ్ ఆలీ నాకు కూల్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు ఇప్పటికే రెండు ఎటాక్ లు ఎదుర్కొన్నావ్ ఎందుకు చెప్పు ఇలాంటి స్టోరీలు అని.. కాకపొతే ఆయన నా వాదనను సమర్ధించేవారు. మరో వైపు మజ్లిస్ లో అసదుద్దీన్ శకం మొదలైనప్పటినుంచి చాలా మార్పులు వచ్చాయి. ఛాందసవాదుల ప్రాబల్యం ఆ పార్టీలో తగ్గిపోయింది. అసద్ భాయ్ తో నాకూ మంచి సంబంధాలు కొనసాగాయి. ఆయన స్వయంగా శుక్రవారం మక్కామసీదులో ప్రార్థనలకు హాజరవుతూ అల్లర్లను అదుపు చేశారు. ఇక్కడ సిటీకేబుల్ నాటి ఒక విషయం చెప్పాలి. అప్పుడు నాకు పోలీసులతో సమస్యలు వస్తే అప్పటి మా బాస్ రవిప్రకాష్ నాకు పూర్తి అండగా నిలిచారు. సమస్య వస్తే ఆఫీసు వదిలి పారిపోయిన ఓ బాస్ ను కూడా చూసా నా కెరీర్ లో. రవిప్రకాష్ మాత్రం ఒక అన్నలా నాకు అండగా నిలిచారు. కాలగమనంలో అసద్ భాయ్ తో కలిసి అనేకసార్లు టివిలో కనిపించటంతో మజ్లిస్ లో నాపై వ్యతిరేకత తుడిచిపెట్టుకుపోయింది.. కానీ ఒక ముస్లింనై ముస్లిం వ్యతిరేకత మూటగట్టుకోవడం నా కెరీర్ లో ఒక ప్రత్యేకతే అనుకుంటున్నా...

No comments:

Post a Comment