Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 1 December 2020

ప్రజాస్వామ్యానికి మరణశాసనం

 

ప్రజాస్వామ్యానికి మరణశాసనం

నిజమే ఇది ప్రజాస్వామ్యానికి మరణశాసనమే...చార్మినార్ సాక్షిగా ఇక్కడి రాజకీయం ప్రజాస్వామ్యానికి మరణశాసనం రాసేసింది.. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన వారే అధికారంలోకి వస్తారు. అయితే హైదరాబాద్ లో మెజారిటీ ప్రజలు పోలింగ్ ను తిరస్కరించారు. ఖచ్చితంగా ఇది తిరస్కరించడమే. నలభై శాతం ఓట్లతో గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే  కొత్తగా వచ్చే పాలకపక్షాన్ని అరవైశాతం మంది ప్రజలు గుర్తించడం లేదనే కదా.. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది. ప్రజల్లో ఇంతగా నిరాసక్తత ఎందుకు ఏర్పడింది. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు పోలింగ్ కు దూరంగానే ఉన్నా ఈ సారి మాత్రం ఎన్నడూ లేనంత నిరాసక్తత ప్రజల్లో కనిపించింది. ఎందుకిలా జరిగింది అంటే ముందుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ మొదటివారంలోనే ghmc కి ఎన్నికలు జరపాలనే రాజకీయ నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించారు.భారీ వర్షాలు వరదలతో నగరం అతలాకుతలమైన పరిస్థితిలో సడెన్ గా ఎన్నికలు వచ్చి పడ్డాయి. మరో రెండు నెలలు సమయమున్నా ఇంత అర్జంటుగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి?  దుబ్బాకలో బిజెపి కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగిన trs నాయకత్వం bjp మరింతగా బలపడుతుందేమో అనుకుందా.. ఇంత అత్యవసర ఎన్నికలు ఎందుకు... ప్రతిపక్షాలను గుక్కతిప్పుకోనీయకుండా చేయాలని కాదా.. ప్రజలు మానసికంగా సిద్ధపడకముందే ఎన్నికలు జరిపేసారు. ఇదే కారణమేమో హైదరాబాదీ బయటికి రాలేదు. మరో విషయం ఏమిటంటే రాజకీయ పార్టీలు ప్రచారంలో ఊగిపోయాయి. హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామనే దాకా వెళ్ళింది పరిస్థితి.ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు రగిల్చేందుకు ఎంత చేయాలో అంత చేశారు. అయితే ఇక్కడి ప్రజలు మతపరమైన అంశాలను చెత్తబుట్టలో పడేసారు. నిజంగానే మతపరమైన భావోద్వేగాలు ఏర్పడివుంటే ప్రజలు బారులుతీరి ఓటు వేసేవారు. మతకలహాలు జరుగుతాయని ప్రభుత్వం  ప్రచారం చేయడం వల్లనే ఓటింగ్ తగ్గిందని బండి సంజయ్ అంటున్నాడు పాపం ఆయనకు హైద్రాబాద్ గురించి అవగాహన లేదు. ఒకవైపు కత్తిపోట్లు జరుగుతున్నా తొంభై శాతం పోలింగ్ జరిగిన చరిత్ర హైదరాబాద్ కు ఉంది. ఎవడొస్తే ఏముంది అనే ఫీలింగ్ నగరవాసిలో బలపడింది. పోనీ ఓటు వేద్దామంటే ఓటర్ స్లిప్ ఉంటే లిస్టులో ఓటు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ పాపంలో ఎన్నికల కమిషన్ భాగమే ఎక్కువ. ఇంటింటికి ఓటర్ స్లిప్ పంపిస్తామని చెప్పారు అది ప్రకటనకే పరిమితమయ్యింది. పోనీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందా అంటే అదీ లేదు. ఒకవేళ  వ్యతిరేకత ఉంటే ఓటర్లు బారులు తీరి మరీ ఓటు వేసేవారు. వాడూ వీడూ అనికాదు మొత్తం రాజకీయులంటేనే హైదరాబాదీలకు ఏవగింపు వచ్చినట్టుంది. ఇక్కడి ప్రజలను నిందించి లాభం లేదు. బలవంతంగా ఎన్నికలు రుద్దటం,  మతాల పేరుతో నీఛ రాజకీయాలకు పాల్పడటం, ఎవడు ఎప్పుడు ఏ పార్టీ కండువా వేసుకుంటాడో తెలియకపోవటం... ఇలా ఎన్నో ఉన్నాయి కర్ణుడి చావుకు లక్ష కారణాలు ఉన్నట్టు.. మొత్తం మీద ఇక్కడ ప్రజలే గెలిచారు రాజకీయం ఓడింది. అయినా కొత్త పాలకవర్గం ఏర్పడుతుంది మెజారిటీ ప్రజల అభిమతాన్ని అపహాస్యం చేస్తూ... ప్రజాస్వామ్యమా ఇది నీకు మరణశాసనం కాదా...

8 comments:

  1. >> వాడూ వీడూ అనికాదు మొత్తం రాజకీయులంటేనే హైదరాబాదీలకు ఏవగింపు వచ్చినట్టుంది.
    సరిగ్గా నాకూ అలాగే‌ అనిపించిందండీ.

    ReplyDelete
    Replies
    1. అలాగే ఉంది సార్ పరిస్థితి

      Delete
  2. రాజకీయాలంటే ఏవగింపు కలిగేటంత కొంపలేం మునిగాయి ? వరదలు ఒక్క హైదరాబాద్ లోనే వచ్చాయా ? పంట చేలు కూడా మునిగాయి. వర్షం రాకపోతే చంద్రబాబు నాయుడు వల్లే అన్నారు. ఇపుడు వరదలొస్తే కేసీఆర్ తప్పా ? నోటికి అన్నం తింటున్నారా లేక చింతకాయ తొక్కు తింటున్నారా ? ఓటింగ్ కి ప్రొద్దున్నే వెళదాం అంటే జనం ఉంటారు అని మావారు అన్నారు. తీరా వెళితే జనమే లేరు. ఎవరికి వారు ఇలానే భయపడి రాలేదు.కరోనా వల్ల భయపడి రాలేదు కానీ బ్రతుకమ్మ చీరలు ఇస్తామంటే జనం ఎగబడి వెళ్ళారు. ఆయనెవరో వ్యాఖ్యాత అన్నట్లు డబ్బుకి ఓటు అమ్ముకునే వాళ్ళందరూ కరోనా వచ్చిపోతే పీడా పోతుంది.

    ReplyDelete
    Replies
    1. బాబోయ్ మీకు కోపం వచ్చేసింది
      అయినా మీకోపం సబబే...

      Delete
  3. Final voting data:

    2009 GHMC POLL : 42.04%
    2016 GHMC POLL : 45.29%
    2020 GHMC POLL : 46.60%

    ReplyDelete
  4. థాంక్స్ అన్నా...

    ReplyDelete
  5. మీ అభిప్రాయంతో ఏకీభవించలేను.
    యుద్ధమే చేయకుండా గెలుపేమిటి? ఇది ప్రజల గెలుపు కాదు. పిచ్చితనం. మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువ పోలింగ్ అయ్యే అవకాశం ఉంది అని ఒప్పుకుంటాను. కారణం హైదరాబాద్ వారు కూడా ఓటు ఇక్కడే ఉన్నా విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు చాలామంది ఉన్నారు.
    కానీ మరీ ఇంత తక్కువ శాతం పోలవ్వడం క్షమార్హం కాదు. ఏ పార్టీలోనూ అందరూ సచ్చరిత్రులు కాని అందరూ దుర్మార్గులు కానీ ఉండరు కదా. అలాంటపుడు అన్ని పార్టీలను అసహ్యించుకుంటే ఏమిటి ఉపయోగం. అసలు ఓటు వేసేటప్పుడు పార్టీని కాక అభ్యర్థిని కదా ముఖ్యంగా చూడాల్సింది.
    ఏ అభ్యర్ధీ నచ్చనపుడు నోటా ఉంది కదా. దానికైనా వెయ్యొచ్చు కదా. అలా చేసినప్పుడే కదా నేతల అహంకారానికి దెబ్బ తగులుతుంది.
    ఓ డెబ్భై శాతం పోల్ అయి సగానికి సగం నోటా ఉంటే ఏమవుతుంది. అత్తెసరు ఓట్లతో గెలిచిన నాయకుడు ఒళ్ళు దగ్గరపెట్టుకుని పని చేస్తాడు. ఎందుకంటే తరువాయి ఎన్నికల్లో ఆ నోటా కాస్తా "not you" గా మారితే తన పదవి ఉండదని అర్థమవుతుంది.

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయాన్ని కాదనీ అనలేను...

      Delete