Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, 19 December 2017

సాగిపోతున్నా నీకు అందనంత దూరంగా

సాగిపోతున్నా నీకు అందనంత దూరంగా 

అవును నిన్న మొన్నటిదాకా ఇది నిజం
నీగురించి నేను ఆలోచించిన మాట నిజం
ఇప్పుడు నా ఆలోచనల్లో నువ్వు లేవు
ఒకవేళ నువ్వు ఆలోచనా స్రవంతిలో
లీలగా తారసపడినా
నువ్వంటే నా మనసు కరగటం లేదు
ఎందుకంటే నా మనసుపుస్తకం పేజీలలో
నీ అక్షరాల గొంతుకను నువ్వే నులిమేసావు
నీకోసం నేను వేదన చెందినదీ నిజమే
ఇప్పుడు నా ఆవేదనలో నువ్వు లేవు
నా తలపుల తలుపులకు నువ్వే తాళం వేసివెళ్లావు
నీకోసం నేను కన్నీరు కార్చిందీ నిజమే
ఇప్పుడు నా కన్నీటి తెరలపై నీ రూపం కానరాదు
కురిసిన నా కన్నీటివానలో నీ జ్ఞాపకాలను
నువ్వే కడిగేసుకుపోయావు
హృదయకోవెలలో నీరూపం నిలిచిందీ నిజమే
ఇప్పుడు మనసు గర్భగుడి వెలవెలబోతోంది
అక్కడినుంచి నువ్వే తరలిపోయావు
నా కనురెప్పల మైదానంలో కలల పొదరిల్లు
ఇంకా కదలాడుతూనే ఉంది
నువ్వే విడిచివెళ్లావు అడుగుజాడలను చెరిపేసుకుంటూ
నీ ఆలోచనలను విసిరేసి
కాలమనే నేస్తంతో ముందుకు సాగుతున్నా
నీకు ఎప్పటికీ అందనంత దూరంగా 

No comments:

Post a Comment