సమరం నీకూ నాకూ
అనుభవాలనే దీపాల వెలుగులో
జ్ఞాపకాల తివాచిపై
ఆలోచనల దుప్పటి కప్పుకున్న నేను
సేదతీరుతున్నా కన్నులలో
కలలను నెమరు వేసుకుంటూ...
నన్ను తాకీ తాకని వెలుగురేఖలు
మెల్లగా కరిగిపోతున్నాయి
కమ్ముకుంటున్న చీకటిలా...
ఆలోచనల దుప్పటిని మెల్లగా తొలగించి
కన్నులు తెరిచి చూసాను
నాకు లీలగా తెలుస్తోంది
నువ్వు చేరువలోనే ఉన్నావని...
అవును నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు
నాకు ఎదురుగా
నాకు ఆ పక్కనా ఈ పక్కనా
వెనుకా ముందూ నువ్వే ఉన్నావు...
నా ఆలోచనలు నిత్యం నీ చుట్టే
తిరుగుతూ ఉంటాయి...
నువ్వు నాతోనే నడుస్తున్నావు
నాకు ముందు నువ్వు నడుస్తూ ఉంటే
నాకు తెలియకుండానే నిన్ను అనుసరిస్తూ ఉన్నాను
నిన్ను దాటి నేను అడుగులు వేస్తె
నా అడుగు జాడవై
నువ్వూ నడుస్తున్నావని తెలుసు...
చీకటి వెలుగుల దొంగాటలా
వెలుగూ నీడల దోబూచులాటలా
పున్నమిని మింగివేసే అమవస రక్కసిలా
కటిక చీకటిని చిదిమివేసే చల్లని వెన్నెలలా
సమరం నీకూ నాకూ మధ్య
ఇది నాకు బాగా తెలుసు...
నేను నీకు చిక్కినా
నువ్వు నన్ను అందుకున్నా
నన్ను మరో లోకానికి
తరలించుకు పోతావనీ తెలుసు
జ్ఞాపకాల దీపాలు మరలా వెలగటంతో
ఆలోచనల దుప్పటిని మళ్ళీ కప్పుకున్నా
మనస్వినీ...
No comments:
Post a Comment