నాకు అన్నీ తెలుసు
విరిసే పెదాల మెరుపుల
మాటున
చీకటిని
ఓడిసిపట్టుకున్న వేదన తెలుసు
వెలుగులు జిలుగుల కంటి
పరదాల వెనుక
ముత్యాల్లా మెరిసే
కన్నీటి చాయలూ తెలుసు
ఆనందాల హేల
సరదాల నావ
మనసు సుడిలో చెలరేగే
అల్లకల్లోలాలూ తెలుసు
నెలవంక చల్లదనం
పంచుకున్న
పాలవెన్నెలకు
చీకటితోనే ఉనికి
ప్రచండ భానుడి
వెలుగులు
చీకటి ఉంటేనే కదా
మెరిసేది
మనసుకు తెలుసు వేదన
కన్నులకు తెలుసు
కన్నీటి విలువ
మనసైన మనసుకు
మనసులోని అంతరం తెలుసు
నా మనసుకు తెలుసు
నీలో దాగిన వేదన
నీ ఆలోచన
నీ అంతరంగం
నీ భావం
నీ ముభావం
నాకు ఎవరో చెప్పాల్సిన
పని లేదు
నువ్వు కూడా నాకు
చెప్పకు
నాకు అన్నీ తెలుసు
మనస్వినీ
