నిప్పురవ్వలు
నిండు పున్నమి వెన్నెలలో
అందమైన ఆడపిల్లలై ఆడుకోవటం తెలిసిన నా అక్షరాలకు
మండుటెండలో భగభగమని మండటమూ
తెలుసు...
మంచు కురిసేవేళలో పువ్వులా
పరిమళించే నా అక్షరాలకు
చెమట చుక్కలను ముద్దాడటమూ
తెలుసు...
జడివానలా కురిసే నా అక్షరాలకు
మండే కొలిమిలో నిప్పురవ్వలై
ఎగసిపడటమూ తెలుసు...
నేను మరణించినా
నా అక్షరాలు
వసంత మేఘాలై గర్జిస్తూనే
ఉంటాయి...
