Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 28 March 2018

ప్రేమించు నన్ను

ప్రేమించు నన్ను
 
మనసు పెట్టి చూడు
కురిసే వెన్నెలలో చందమామ నవ్వులా
మెరిసిపోతాను
కనులు మూసి విను
విచ్చుకుంటున్న మొగ్గలో
చిరుసవ్వడిలా నీ గుండెను
తాకిపోతాను
ఆరాధించు నన్ను
నిత్యం నీ శ్వాసలో ఊపిరిలా
కరిగిపోతాను
ప్రేమిస్తూనే ఉండు
లేతమారాకుపై మంచు బిందులా
తళుకులీనుతూ
జారిపోతాను
ప్రేమించు నన్ను
నీ గుండె శ్రుతిలో లయలా
జాలువారుతూ ఉంటాను
విడనాడకు నన్ను
నీలి నింగిలో తేలిపోయే మబ్బుల్లా
అందకుండాపోతాను


Sunday, 25 March 2018

తెర చాపను కాదు

తెర చాపను కాదు
 
 కదిలే నావకు కట్టిన తెరచాపనా
గాలివాలుకు దిశను మార్చుకునేందుకు
కొత్తనీరుకు అలమటించే చేపనా
ఏటికి ఎదురీదేందుకు
బాట తెలియని బాటసారినా
గమ్యం తెలియక నడిచేందుకు
లోకం పోకడ తెలియని అజ్ఞానినా
మాయానగరిలో మాయమయ్యేందుకు
కొంచెం తడబడ్డానేమో
కుప్పకూలిపోలేదు
దశ మారదని తెలిసినా
దిశను మార్చుకోలేను

Thursday, 22 March 2018

చచ్చేంత ఇష్టం ...

చచ్చేంత ఇష్టం ...
నెలరాజుకు కలువకన్య ఎంత ఇష్టం
విరిసే కమలానికి
సిరివెన్నెల ఎంత ఇష్టం
పక్షిరాజుకు
నీలాకాశం ఎంత ఇష్టం
నువ్వంటే నాకెంత ఇష్టమో
తెలియదు నాకు
ఇష్టానికి కొలమానాలు
లేనే లేవు నాకు
ఒకటి మాత్రం చెప్పగలను
నువ్వు నాలో ఉన్నంతకాలం
నేనంటే చచ్చేంత ఇష్టం నాకు..


నా ఇష్టం...

నా ఇష్టం... 

ఓటమి అంచుకు చేరినా
విజయతీరాను వెతకటం నాకిష్టం...
వెలుగును మింగిన చీకటిలో
నింగిని చూస్తూ
మిలమిల మెరిసే నక్షత్రాలలో
మెరుపును కనులలో నింపుకోవటం
నాకిష్టం...
ఉషోదయపు కిరణాలతో
చీకటిమరకలను తుడుచుకోవటం
నాకిష్టం...
తన్నుకుపోవాలని చూసే రాబందులలో
బంధువులను వెతకటం
నాకిష్టం...
వెన్నెలైనా
చీకటైనా
నా మనసుదీపం ఆరకుండా
చూసుకోవటం
నాకిష్టం...
పునాదులు కరిగిపోతున్నా
శిఖరమై నిలవడమే
నాకెంతో ఇష్టం...

Wednesday, 14 March 2018

వెళ్ళిరానా ఆ లోకానికి

వెళ్ళిరానా ఆ లోకానికి


మరో లోకం అంచుల్లో
విహరించాలని ఉంది...
మబ్బు తునకలతో
గూడు కట్టుకోవాలని ఉంది...
చందమామ వంపును
జారుడుబల్లగా చేసి
ఆడుకోవాలని ఉంది...
చుక్కలవీధిలో
స్వేచ్ఛా విహంగమై
విహరించాలని ఉంది...
నవ్వే తారకల చిరునవ్వులను
ఒడిసి పట్టాలని ఉంది...
దేవుడికెంత స్వార్ధం
తానొక్కడే అక్కడ కూర్చుని
ఇక్కడ నాతో ఆడుకుంటున్నాడు...
భువినుంచి దివికి
మెట్లు కట్టి ఉంటే
వెళ్ళిరానా ఆ లోకానికి
మనసు ముభావమైన వేళ...

Saturday, 10 March 2018

మనసు కార్ఖానా

మనసు కార్ఖానా

మనసు కార్ఖానా ఉందా ఎక్కడైనా
తెలుసా దాని చిరునామా ఎవరికైనా
మరమ్మత్తు చేసుకోవాలి మనసుకు ఇకనైనా
మార్చుకోవడమే మంచిది మనసును ఎందుకైనా
ఉన్నతంగా ఆలోచించమంటే వినదు ఎంతైనా
మామూలు మనసునే అంటుంది ఎప్పుడైనా
పిచ్చిగానే ప్రేమిస్తుంది వద్దని వారించినా
అంతా నాదేనని మారాం చేస్తుంది ఏదైనా
వాస్తవాలు గ్రహించదు ఏ పరిస్థితి ఎదురైనా
శస్త్ర చికిత్స చేయాలి మనసుకు ఎలాగైనా
అడవి మనసును పట్నం మనసుగా మార్చాలి కొంతైనా
పాత పచ్చడిని తీసేసి అభ్యుదయం అద్దాలి ఇప్పుడైనా
నాగరికత నేర్పాలి మనసుకు ఏం చేసైనా
ఉన్నదా ఎక్కడైనా మనసు దవాఖానా
తెలుసా దాని చిరునామా ఎవరికైనా 

Friday, 9 March 2018

అరణ్యవాసినా

అరణ్యవాసినా

అర్థం కాని వ్యర్థమైన ఆలోచనలకు
భావుకత ముసుగేస్తూ
అక్షరాలు రాసుకుంటూ ఉంటా ...
వేకువ పొడుచుకువచ్చినా
చల్లని వెన్నెలకై నీలి నింగి వైపు
ఆశగా ఎదురుచూస్తూ ఉంటా ...
ఓటమి శిలను నెత్తిన మోస్తూ
తెలియని విజయం కోసం
పిచ్చిగా పరుగులు తీస్తూ ఉంటా ...
జనారణ్యంలో ఉంటూ
కీకారణ్యం విధానాల కోసం
శాసనాలు రాస్తూ ఉంటా ...
ఓ చీకటి తెరను భగ్నం చేసి
మరో చీకటి దుప్పటిని కప్పుకుని
కృష్ణ బిలంలోకి జారిపోతూ ఉంటా ...
తెలియని నిజం కోసం అబద్ధాలను ముద్దాడుతూ
అలుపెరుగని బాటసారినై నిత్యం శోధిస్తూనే ఉంటా ...
కూలిన శిఖర శిథిలాలను తోసిరాజని
పేకమేడలు నిర్మిస్తూ  
నిర్జీవ రాజ్యానికి నియంతలా నిలిచి ఉంటా ...
నేను కవినా
అరణ్యవాసినా
వేకువలో వెన్నెలనా
ఎన్నడూ పలకరించని గెలుపునా
గమ్యమే తెలియని బాటసారినా
అనంతకోటి ప్రశ్నలను
నాపై నేనే సంధించుకుంటూ ఉంటా ...

పిల్లర్ నెంబర్ 176

పిల్లర్ నెంబర్ 176
(సహారా కెఫె)

కొన్ని సంవత్సరాల అనుబంధం
మనసుకు ఏమీ తోచనప్పుడు ఇక్కడికే వస్తా...
ఒంటరిగానే కూర్చుంటా
 వచ్చిపోయే వాళ్ళను గమనిస్తూ..
అంతా మధ్యతరగతి వాళ్ళే
అదే గొప్పోళ్ళు అంటుంటారే థర్డ్ క్లాస్ మెంటాలిటీస్ అని
అవును అంతా వాళ్ళే..
ఎవరికి ఎవరూ ఏమీ కారు
ఒకరిమతం మరొకరిది కాదు
అయినా ఆత్మీయ పలకరింపులు
ఖైరియత్ భాయ్ అని ఒకరు
నమస్తే అన్నా బాగున్నావా అని మరొకరు...
తరచి చూస్తే ఒక్కో మనసులో ఒక్కో వేదన
తమ కష్టాలపై తామే జోకులేసుకునే పిచ్చితనం...
ఏమైతేనేం అందరూ బంధువులే..
అసలైనా ఈ ఆత్మీయులను చూస్తూ వాళ్ళ ముచ్చట్లను వింటుంటే ఆకలి కుడా గుర్తుకు రాదు...
స్టార్ హోటల్ లో కూర్చుని మందు కొడుతున్నా ఇక్కడ దొరికే అనిర్వచనీయమైన తృప్తి దొరకదేమో అనిపిస్తోంది...

Tuesday, 6 March 2018

అన్నీ తెలుసు...

అన్నీ తెలుసు... 

నీ నుంచి విడివడిన ఆ క్షణాలు
శాశ్వతం కావని తెలుసు
ఎడబాటు తాత్కాలికమేననీ తెలుసు
వీడ్కోలు చెప్పేవేళ నీ భావాలూ తెలుసు
నీ కంటిపాపను కమ్మిన సన్నటి నీటి తెర తెలుసు
నీ పలుకుల్లో లీలగా ధ్వనించే నైరాశ్యమూ తెలుసు
చేయి ఊపుతూ నవ్వుతున్న నీ మోములో
ముభావమూ తెలుసు
మిస్ యూ అంటున్న నీ మాటల మతలబూ తెలుసు
నీకేం తెలుసు
నా మనసును అక్కడే వదిలేసి వస్తానని
నీ ఊసులన్నీ అది నాకు చెబుతూనే ఉంటుందని

వెలుతురునా చీకటినా

వెలుతురునా చీకటినా

వెలిగేదీపం కింద నక్కిన
నల్లని చీకటిని చెరిపేయాలని
నా ఆరాటం...
చందమామలో నల్లని మబ్బులను
చిదిమేయాలని
నా ఉబలాటం...
నిప్పులు చెరిగే సూరీడులో
నలుపు వలయాలను లెక్కించాలని
నా ఆవేశం...
తెల్లని కాగితంపై
నల్లని అక్షరాలతోనే
నా సహవాసం...
వెలుగులో నడుస్తూ
నల్లని చీకటికి భయపడే నేను
వెలిగే వెలుతురునా
కరిగే చీకటినా...


Sunday, 4 March 2018

ఎంత పిచ్చిది కదా మనసు

ఎంత పిచ్చిది కదా మనసు

ఉషస్సు వేళ నీ తొలి పలకరింపు
భానుడి పయనంతో నడిచే  
ప్రతిఘడియలో నీ పలుకు
సంధ్య పులకింతలో రేయిని
స్వాగతించే చల్లని నీ గుభాళింపు
అన్నీ నాకే ముందు కావాలని
మారాం చేస్తోంది మనసు...
చంద్ర వదన సింగారాలు
కనుల కొనలనుంచి జాలువారే
వెన్నెల జలపాతాలు
కాటుక కంటిపై అల్లుకున్న స్వప్నాలు
మేఘాలను అల్లే కురుల వయ్యారాలు
నవ్వులు రువ్వే మల్లికల సోయగాలు  
పెదాలపై అద్దుకున్న గులాబీల మిసమిసలు
పసిడిని మరిపించే
నిలువెత్తు ధగదగలు
అన్నీ నా కనురెప్పలలోనే దాచుకోవాలని
మరో కంటినీడ కూడా తాకరాదనీ
ఆరాటపడుతోంది నా మనసు...
ఎంత పిచ్చిది కదా నా మనసు
మనసులాగే ఆలోచిస్తోంది...