మరణిస్తున్నది నా
దేశమే..
ఒక ముద్ద అన్నం లేక
పేగులు చుట్టుకుపోయి
గాలిలో కలిసిపోయిన
ప్రాణాలు ఎన్నో...
బయిటికి పొతే కొట్టి సంపుతారని
నాలుగు గోడల నడుమ కొన ఊపిరితో చావలేక
బతకలేక డీలా పడుతున్న
బతుకులు ఎన్నో...
మండుటెండలో కాలినడకలో
కోరలు చాస్తున్న సూరీడునుంచి తప్పించుకోలేక
గుక్కెడు నీళ్లు కరువై
కళ్ళు తిరిగి సొమ్మసిల్లి
అసువులు బాస్తున్న నిర్భాగ్యులు ఎందరో...
నిండీ నిండని డొక్కలతో
రైలు పట్టాలే దిక్సూచిగా
నడిచీ నడిచీ అలసి సొలసి
ఇనుప చక్రాల కింద నలిగిపోయిన బతుకులెన్నో..
పాలకుల ప్యాకేజీలు
ఉన్నోడికి జిలేబీలై
లేనోడికి అందని ద్రాక్షలై
గాలిలో కలిసిపోతున్న
బడుగు జీవుల ఆశలెన్నో...
ఎవడురా చెప్పింది పేదలు చస్తున్నారని
చస్తున్నది నా భారత ప్రగతి చిహ్నాలే....
అవును ఇప్పుడు చస్తున్నది
పేదలు ఎంత మాత్రం కాదు
ఆకలికి అలమటిస్తూ
మరణిస్తున్నది
నా భారత దేశమే...
No comments:
Post a Comment