Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 25 October 2018

కరిగిపోవా...

కరిగిపోవా...
ఆలోచనా తరంగాలు
సైనిక పటాలాలై
హృదయసీమను
కదనసీమగా మార్చివేస్తే
బీటలువారిన హృదయంలో
రక్తకణాలన్నీ
 
కన్నీటీ చుక్కలుగా మారిపోతే
పెదాలపై అంటించుకున్న
కాగితంపూల నవ్వులన్నీ
కనులవానలో తడిచిపోయి
కరిగిపోవా...


ఉలకవా పలకవా

ఉలకవా పలకవా

నువ్వున్నావనే భరోసాతో కొట్టుకుంటున్నారా
లేనే లేవనే క్లారిటీతో రెచ్చిపోతున్నారా
నాస్తికులు నక్సలైట్లయ్యారు
ఆస్తికులు తాలిబాన్లయ్యారు
నువ్వేమో ఉలకవూ పలకవైతివి
నీ మసీదును నువ్వు కాపాడుకోలేవు
నీ మందిరం నువ్వు కట్టుకోలేవు
పడేయాలన్నా నిన్ను నిలబెట్టాలన్నా
మనుషులే కావాలి
నీ పవిత్రత అంటా
 
అదేంటో నాకు తెలియదు కానీ
 
అది కూడా మనుషులే కాపాడాలి
మా రక్తం ఒకే రంగైనా
 
నీ రంగులను పులుముకుని
మేం పొడుచుకుని చావాలి
ఉన్నావా అసలు
 
ఉంటే నిన్ను నువ్వు కాపాడుకోలేవా
నీ రక్షణకే మేం చస్తుంటే
ఇంకా నువ్వుంటే ఏంటి
లేకుంటే ఏంటి?
నువ్వులేవని తెలిసినా
అందరిలాగే ఊహించుకుని
తిట్టిపారేస్తున్నా
ఏమనుకోకు
నేనింతే...

ఏమైంది ఈ వేళ?

ఏమైంది ఈ వేళ?

వేదనా ఇది రోదనా
ఆవేశమా ఉధ్విగ్నతా
ఎగసిపడుతున్న మనసు కెరటాల సంకేతమా
నీ సవ్వడి చెవులను కాక
మనసును తాకిన పర్యవసానమా
ఎందుకు మాటలు మౌనమయ్యాయి
ఎందుకు కనురెప్పలు
తడిసి ముద్దయ్యాయి..
ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ అలజడి ఎందుకు?

Wednesday, 10 October 2018

భావరహిత వదనంలా

భావరహిత వదనంలా

కనుల కొలనులో తేలియాడుతున్న ఓ స్వప్నాన్ని
జారనీయకుండా
ఒడిసిపట్టుకున్నా
కొత్తకలలేవో పరిచయం చేయాలని....
పసిడి వెన్నెలలో జలకాలాడుతున్న భావసుందరిని పలకరించా
కొత్త నడకలేవో నేర్పాలని...
జాలు వారిన అక్షరాలలో
స్వప్నం జారిపోయింది
వెన్నెల వానలో
భావిక కరిగిపోయింది...
మొలకలువేయని అక్షరాలను
మననం చేసుకుంటూ
రూపుదాల్చని భావనలను
శోధిస్తూ
మౌనమై మిగిలిపోయా
భావరహిత వదనంలా

గుర్తు పట్టాలనీ....

గుర్తు పట్టాలనీ....

నన్ను గుర్తు పట్టేందుకు
నా గదిలోని అద్దం నిరాకరిస్తోంది...
నువ్వు నువ్వే కాదనీ
నువ్వు మళ్ళీ నువ్వైనప్పుడే
నా ముందుకు రమ్మని మొరాయిస్తోంది...
నన్ను నేనే గుర్తు పట్టనప్పుడు
అద్దాన్ని మాత్రం
ఎలా సముదాయించగలను...

ఎక్కడ తప్పిపోయా నేను

ఎక్కడ తప్పిపోయా నేను

అంతమే లేని ఆలోచనల 
పోరులో
అవధులే లేని ఆవేశాల
 
హోరులో
అర్థమే లేని అంతరంగాల
పరుగులో
సాంత్వనే దక్కని హృదయాల
 
సవ్వడిలో
మాటలే కరువైన మనసుల
మంతనాలలో
వ్యక్తిత్వంపై మసిపూసే
 
మారేడు కాయలో
నడతను గేలిచేస్తూ కరిగిన
 
అడుగుజాడల్లో
ఎక్కడ తప్పిపోయాను నేను
బరువుగా సాగిపోయిన
కాలంలో...

Monday, 1 October 2018

అంతులేని ప్రశ్నలా...

అంతులేని ప్రశ్నలా...
చెదురుతున్న భావాలను
ఒడిసిపట్టాలనీ
పారిపోతున్న అక్షరాను
ఒక మాలగా కూర్చాలనీ
గజిబిజి మానసానికి
సాంత్వన చేకూర్చాలనీ
ప్రశ్నల సాగరాన్ని మదించి
సమాధానాలను వెలికితీయాలనీ
అర్ఢంకాని ఆవేదనకు
ఒక అర్ధమివ్వాలనీ
నన్ను నేను శోధిస్తూ
ఇంకా మిగిలే ఉన్నా
అంతులేని ప్రశ్నలా
ఎన్నటికీ తేలని జవాబులా.


జడివానై కురిసిపోనా

జడివానై కురిసిపోనా

కమిలిన పెదాలు ఎరుపును వీడి
 
నీలి రంగును పొందగా
అర్ధనిమిలీత నేత్రాలు
సుఖమై చుక్కలను స్రవించగా
నుదుటి స్వేదువుల ఆవిరిలో
మేఘమైన నేను జడివానలా
కురిసిపోనా మనస్వినీ...