Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 19 April 2022

గులాబీ ముసుగులు

 

గులాబీ ముసుగులు


హృదయసీమలో మొలకలు వేసిన ప్రశ్నలు

విచ్చుకత్తులై నాట్యమాడుతున్నాయ్

ఎన్నటికీ దొరకని నగ్న సమాధానాలను

శోధిస్తూ...

గాయం చేసిన ముళ్ళు

గులాబీ ముసుగులతో నటనలాడుతున్నాయ్

లేని పరిమళాలను వెదజల్లుతూ...

Friday, 8 April 2022

సర్వం నేను

సర్వం నేను


నిశి రాత్రిని నేను

నిశిలో మెరిసే శశినీ నేను...

జాలువారే వెన్నెల నేను

పసిడివెన్నెలను ఈదే చకోరం నేను...

నులి వెచ్చని ఉషోదయం నేను

సెగలు పుట్టించే వేసవి తాపం నేను...

కురిసే వానను నేను

మురిసే మట్టివాసనను నేను...

సమస్త విశ్వానికి ఉనికిని నేను

నేను కన్ను మూస్తే

                                       ప్రకృతి సర్వం శూన్యం... 

Monday, 4 April 2022

ఎక్కడ తప్పిపోయిందో...

 

ఎక్కడ తప్పిపోయిందో...


దోసిట పట్టి

గుండెలో దాచుకుందామని అనుకున్నా

ఎలా జారిందో

ఎక్కడ దాగుందో...

నిశి వీధిలో దారి తప్పిందా

తారాలోకంలో చుక్కల పంచన చేరిందా...

వాడిన వసంతపు తోటలో కనులు తెరిచిన పువ్వుపై

స్వాతి ముత్యమై మెరిసిందా...

నానుంచి దూరమవ్వాలనే

ఆతృతలో పుడమివైపు జారిపడిందా...

నేలలోకి ఇంకిపోయి

నవ అంకురానికి జీవం పోస్తోందా...

తడియారుతున్న గుండెకు లేపనం అద్దాలని

కనుల కనుమల్లో అపురూపంగా దాచుకున్నా

ఎక్కడ తప్పిపోయిందో

నా కన్నీటి చుక్క...