ఒక్కసారి వచ్చి చూడు
వేదనగా రోదిస్తోంది
మనసు
విదారకంగా
విలపిస్తోంది హృదయం
ఆర్తిగా అడుగుతోంది
అంతరంగం
ఒక్కసారి గుండెవిప్పి
చూడమని
మనసు లోతుల్లోకి తొంగి
చూడమని
అనుమానం ముసుగులు వీడి
ఆవేశం పరదాలు దాటి
ఒక్కసారి వచ్చి చూడు
మనసు మందిరంలోకి
నువ్వున్నావో లేవో అని
నీ అనుమానం
చొరబాటు చేస్తున్నావని
భేషజం
కళ్ళు విప్పి చూడు
మనసు నిండా నువ్వే
గుండె గుడిలో నీ రూపమే
ప్రతి కవాటంలో నీ
సవ్వడులే
నువ్వే కొలువైన గుడిలో
నీ ప్రతిమే తారాడే
మదిలో
నువ్వు చొరబాటు ఎలా
చేయగలవ్
అక్కడ నువ్వే ఉన్నావ్
నువ్వే కొలువయ్యావ్
నువ్వే
పూజలందుకుంటున్నావ్
ఈ జన్మలో తెలుసుకోగలవా
నిజాన్ని
నిన్ను నీవు
నీ విలువ నీవు
తెలుసుకోలేక
మనసును నిందించి
మంటలు ఎందుకు రేపుతావు
బాధ్యతల బాటలో
ఓనమాలు దిద్దిన నీవే
నీవు నేర్పిన
అక్షరాలనే
ఎందుకు చెరిపివేస్తావు
నీవు చూపిన బాటలో
పువ్వులూ గుచ్చుకునే
ముళ్ళూ
గాయం చేసే రాళ్ళూ
పరుచుకున్న
తివాచీలేనని
నీకు మాత్రం తెలియనిదా
నా బాటను మాని నీ
బాటలో
అడుగులువేయటమే నేరమా
ఎప్పుడైనా చూసావా నా
మనసులోకి
తట్టిలేపే యత్నం
చేసావా అంతరంగాన్ని
రోదిస్తున్న మనసు ఇక
తట్టుకోలేనంటున్నది
విలపిస్తున్న హృదయం
స్పందనలు వల్లకాదని అంటున్నది
ఒక్క చల్లని మాటకోసం
గుప్పెడంత మమత కోసం
మనసు ఆరాటపడుతోంది
మనస్వినీ
No comments:
Post a Comment