నవోదయం కోసం
అదిగో
అక్కడేదో చుక్కల లోకం
రమ్మని పిలుస్తోంది
నవ వసంత కోయిలలా...
ఇంతలోనే ఏమయ్యింది
ఆ మెరిసే అగ్నిశిఖ
నావైపే దూసుకువస్తోంది...
చుక్కల నీడలో వెన్నెలదుప్పటి
కప్పుకుని
సేదతీరాలని అనుకున్నా
ఇప్పుడు నిప్పుకణికలను
ముద్దాడాలా...
ఆ పక్కన ఏదో చిరుగాలి సవ్వడి
చేస్తోంది
ఎదను తాకి గిలిగింతలు రేపుతోంది
అప్పుడే పూసిన వసంతంలా...
ఏదని నమ్మను
ఎలా నమ్మను
ఈ క్షణానికి
ఆ క్షణానికి
పొంతనే లేదెలా...
అయినా
నడుస్తున్నా
నడుస్తూనే ఉన్నా
పెదాలపై చిరునవ్వులు అద్దుకుని
కనులనిండా వెన్నెల నింపుకుని
గుండె గుడిలో చిరుదీపం
వెలిగించుకుని
నవోదయం కోసం అడుగులు వేస్తున్న బాటసారిలా....
No comments:
Post a Comment