Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 24 January 2018

శూన్య మనస్కుడను

శూన్య మనస్కుడను

నాలో జీవమును వెతకకు
ఇంకిన ప్రవాహాల ఆనవాలును నేను
రాళ్ళు రప్పలు తేలి నిర్జీవమైన నదిని నేను ...
నా రూపమును చూడాలని అనుకోకు
పగిలిన అద్దంలో ఆర్తనాదాలు చేసే ఛాయను నేను
ముక్కలై వెక్కిరించే వికారమైన వదనము నేను ...
నాలో మరలా చిరునవ్వులు శోధించకు
వాడిన వసంతంలో పనికిరాని ఎండుటాకును నేను
సుగంధాలకై తహతహలాడిన కాగితం పువ్వును నేను ...
నాలో  గుణగణాలను లెక్కించమాకు
నీవు అసహ్యించుకునే మతములో భాగమును నేను
విలువలను వలువలుగా విడిచే వికట జీవిని నేను ...
నా మనసును తడమాలని చూడకు
చితిమంటలలో కాలిన దేహమును నేను
దీపం ఆరిన శూన్య మనస్కుడను నేను ...
నన్ను పరిగణలోకి తీసుకోకు
తెగిడిన నాడే స్పందించలేదు నేను
పోగిడినంతనే పులకించగలనా నేను ...

1 comment:

  1. మేము ఒప్పుకోముగా..మనసు నిండా ఇన్ని మధుర భావాలు పెట్టుకుని శూన్యమనస్కుడిని అంటే ఎలా

    ReplyDelete