Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 26 December 2019

జయహో...


జయహో...

ఒక వైఫల్యం నుదుటన ముద్దాడింది
తలమీద ఓటమి కిరీటాన్ని
అలంకరిస్తూ...
ఒక నిట్టూర్పు ఒళ్ళు విరుచుకుంది
గుండె కవాటాలను
తడుముతూ...
ఒక అశ్రువు నేల జారింది
కనుల కొలనుకు వీడుకోలు
చెబుతూ...
ఒక భావం రెక్కలు విచ్చుకుంది
ఓడిన మనసుకు
జయజయ ధ్వానాలు పలుకుతూ..

దేవాలయం


దేవాలయం


నల్ల ముసుగేసిన పుడమిపై
వెండివెన్నెల రంగులు వెదజల్లినట్లు
నులివెచ్చని ప్రభాత కిరణాలు తాకి మంచు బిందువులు నవ్వినట్లు
చిరుగాలి సవ్వడికి
గులాబీరేకులు నెమలి నాట్యం చేసినట్లు
మంద్రంగా తడిమే సంగీతానికి
నా మనసుతెరపై ముద్రవేసిన వేదనలు కరిగిపోతూ ఉంటాయి
కొన్ని ఘడియలైనా
అవును
శ్రావ్యమైన సంగీతమే నాకు దేవాలయం..

Monday, 2 December 2019

విప్లవం జిందాబాద్...


విప్లవం జిందాబాద్...
అక్క కాదు

చెల్లి కాదు
పక్కింటి ఆడ బిడ్డ కాదు
ప్రతి గుండెను కదిలించింది
ప్రతి హృదయాన్ని రగిలించింది
భగ భగ మండే నిప్పు కణిక యువతరం కదిలింది
బందూకుల మాటున రాక్షసులకు పహారా ఎందుకని సింహగర్జన చేసింది
ఎవరు చెప్పారు నాదేశంలో
విప్లవం మరణించిందని..
బాధిత పీడిత అణగారిన గుండెల్లో అది నిత్యం ఊపిరులు పోసుకుంటూనే ఉంది..


Thursday, 21 November 2019

అక్షర పిడుగులు


అక్షర పిడుగులు

భావం కత్తులు దూస్తోంది

అక్షరం గాయం చేస్తోంది
పూలవంటి ఆక్షరాలే
పిడుగులు కురిపిస్తుంటే
మనోభూమి కలవరపడుతోంది
అక్షర సమరానికి సలాము చేస్తూ
భావికల తోటను తగులపెట్టుకుంటున్నా
మృతజీవుల నగరిలో
కాటి కాపరిలా..


Wednesday, 23 October 2019

మెరుపు చుక్క


మెరుపు చుక్క
వ్యధా భరితమైన

అశ్రువు ఒకటి నేలను జారింది
మౌనంగా రాలిపడిన పుష్పంలా...
నివురును వీడిన నిప్పురవ్వ ఏదో ఆర్తనాదం చేసింది
నింగీ నేలా ఏకమయ్యేలా...
తారాలోకం వీడి నేల వైపు
ఆర్తిగా రాలిన మెరుపు చుక్క
నా చెవిలో గుసగుసలాడింది
నువ్వు ఓడిపోయావని...
నేనేం చేయగలనింకా
మెరుపు రవ్వను ఒడిసిపట్టుకుని
పెదాలపై పులుముకున్నా
చెదరని నా చిరునవ్వులా..


Thursday, 3 October 2019

మరమనిషిగా మార్చేయ్


మరమనిషిగా మార్చేయ్
నా దేహంలోని నరాలన్నీ లాగేసి
విద్యుత్ తీగలు అల్లేయ్
ఎముకలను తీసేసి ఇనుప రాడ్లు బిగించేయ్
గుండె గదిలో సర్వర్ రూమ్ పెట్టేయ్
మెదడును తీసేసి
మెమోరీ చిప్ అమర్చేయ్
చీకటిని చూడలేని నా కళ్ళను పీకేసి
హై పవర్ బల్బులు పెట్టేయ్
నాదేహంపై చర్మాన్ని వలిచేసి
ఇనుపకవచం తొడిగేయ్
రక్తమాంసాల ముద్దలు
మనుషుల లోకంలో ఇమడలేక పోతున్నా
దేవుడా నువ్వు నిజంగానే ఉంటే
నన్ను మరమనిషిగా మార్చేయ్..


దయ్యాలు


దయ్యాలు
దేవుడెలాగూ దొరికేలా లేడు
దయ్యాలను వెతకాలని అనుకున్నా
స్మశానాల్లో శోధించా
కీచరాళ్ల సవ్వడి తప్ప
పిశాచాల కీచుగొంతులు
వినిపించనే లేదు
ఊడలమర్రి కొమ్మలలో వెతికా
ఆకులు రాలుతున్నాయి తప్ప
దయ్యం ఆనవాళ్లే కానరాలేదు
ఊళ వేసే నక్కను అడిగా
గబ్బిలాల గుంపులో వెతికా
దయ్యలూ భూతాలు మాకు తెలియదని అన్నాయి
అలసిసొలసి నగరంలోకి నడిచా
వీధిదీపాల వెలుగుల్లో
చీకటిగదుల సరాగాలలో
విఫణి వీధుల్లో
మనసుల సంతలో
అనుబంధాల ముసుగులో
లక్షలాది దయ్యాలు హాహాకారాలు చేస్తూ కనిపించాయి
మనిషిలో దేవుడున్నాడో లేడో గానీ అణువణువునా దయ్యం ఉందని తెలుసుకున్నా
మరి నాలో దయ్యం దాగుందో...