పీడకల....
అదేంటో సడెన్ గా మంచోడినైపోయా...
నాలోని అవలక్షణాలకు మంచిరంగు
ముసుగేసుకున్నా... నా తప్పులన్నీ ఒప్పులుగా కనిపిస్తున్నాయి... కడిగిన ముత్యంలా మెరిసిపోతున్నా....
మనసులో గొప్ప గొప్ప భావాలు
పుట్టుకువస్తున్నాయి...
ఉన్నట్టుండి ఈ సమాజాన్ని
ఉద్ధరించి పారేయాలనే మహోన్నత ఆలోచన నన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం మెదలు పెట్టింది..
మనసు ఉబలాటపడుతోంది మంచితనం అందరికీ పంచేయాలని... ఏం చేయాలి ఏం చేయాలి మనసు ఆగటం లేదు
నేను మంచోడిననే విషయం అందరికీ చెప్పేయాలి..అవునూ సోషల్ మీడియా ఉందిగా... ట్విట్టర్
లో మనల్ని ఎవడూ దేఖడు... మరి ఇన్ స్ట్రాగ్రామ్... అక్కడ యూత్ హవా మనల్ని ఎవడూ చూడడు...
అన్ని అవస్థలకు ఒకటే మందు మన ఫేస్ బుక్ ఉందిగా... అంతే నాలోని మంచితనం నిద్ర లేచింది...
పోస్టుల మీద పోస్టులు స్టార్ట్....
మంచే చేయండి మంచి జరుగుతుందని
చెప్పడం మొదలు పెట్టా నాలో మంచి ఎక్కడన్నా ఉందా అనేది వేరే విషయం... నేనెవరినీ మోసం
చేయలేదు నేను మంచోడిని గనుక మోసపోయా అని మొసలి కన్నీరు కార్చా నేను చేసిన మోసాలు అటకమీదకు విసిరేస్తూ... పనిలో
పనిగా గూగుల్ లో సెర్చ్ చేసి మరీ బరువైన కొటేషన్స్ పోస్ట్ చేసా.... అబ్బబ్బా ఏమి లైక్స్...
సూపర్ కామెంట్స్... అందరూ ఫిదా అయిపోయారు నా మంచితనం పోస్టులకు... పైగా టన్నుల కొద్ది
సానుభూతి కూడా వర్షంలా తడిపేస్తోంది... తృప్తిగా అనిపించి మరో మంచిపోస్టు రాయాలని రెడీ
అవుతున్నా.... అంతలోనే గావుకేక పెట్టి నిద్రలోనుంచి లేచి కూర్చున్నా.... బాబోయ్ ఇంత
భయానక పీడకల వచ్చిందేమిటీ అని వణుకుతూ నన్ను నేను తడిమి చూసుకున్నా... నో డౌట్ నేనే...
నేను మంచోడిలా మారింది కలలో మాత్రమే...
బతికిపోయాను....
No comments:
Post a Comment