మృతసంజీవని
రోజూ కురిపించే
వెన్నెలను
చందమామ తనలోనే
దాచుకున్నాడా
ప్రతిరాత్రి తనకు
కష్టమెందుకని
వెన్నెలమ్మ
పారిపోయిందా
ప్రతి ఉదయం పుడమిని
పలకరించే సూరీడు
ఎన్నడైనా మొహం చాటేసాడా
చీకటమ్మ తనువును
నిత్యం తాకే
వెలుతురు ఎప్పుడైనా
అలిగిందా
గుండె లయలను నడిపే
ఊపిరి
ఏ ఘడియనైనా శ్వాసపై
మక్కువ వీడిందా
పువ్వుకు పరిమళమంటే
విసుగు ఉంటుందా
చల్లని నెలరాజుని
నేనైతే
నన్ను అలుముకున్న
వెన్నెలమ్మవు నీవు
నిశిరాతిరిని నేనైతే
నా వేగుచుక్కవే నీవు
ఊపిరి నేనైతే
నన్ను నడిపే శ్వాసవే
నీవు
పువ్వును నేనైతే
విరజిమ్మే పరిమళం నీవు
కనులముందు నిత్యం నీవే
ఉంటే
నీ పలుకులు నిత్యం
వీనులను తాకుతుంటే
నాలో నవచైతన్యమే
నీ ఉనికి నాకు నిత్యం
జీవన మంత్రమే
నీవే నాకు ప్రాణం
నీవు లేకపోతే అది
మరణమే
మృతసంజీవనిపై
విసుగుపుడుతుందా
మనస్వినీ
No comments:
Post a Comment