మనసు దర్పణం
కనురెప్పల
సరిహద్దుల్లో
ఘనీభవించిన నీటి
చుక్కను
తరచి చూడు ఒక్కసారి
గాజుఫలకంలా మారిన
బిందువులో
కథలు చెప్పే
రంగులెన్నో
ఊసులు పలికే
భావాలెన్నో
రంగు రంగులో ఒక భావం
ప్రతి భావంలో ఒక
పరిమళం
ఉషస్సువేళ
సూరీడు కంటే ముందే
నీ తీయని పలకరింపుతో
శుభోదయం అంటుంది మనసు
చిరునవ్వులు చిందిస్తూ
నడియాడే నిన్ను గాంచి
పులకిస్తుంది జీవనం
అల్లరి పరుగులు
కొంటె నవ్వులు
పులకింతలు
తుళ్ళింతలు
ఎన్నెన్నో సరాగాలు
అదే మోము ముభావమైతే
అదే పలుకు అప్రియమైతే
మనసు మూలలో ఎక్కడో
ద్రవీభవించిన నీరు
కంటి మైదానం దాటి
సరిహద్దుల్లో నీటి
చుక్కగా మారదా
కనిపించీ కనిపించని
కన్నీటి చుక్క
అద్దంలా మారి
నా మనసు వెతలకు
దర్పణం పట్టదా
మనస్వినీ
No comments:
Post a Comment