దేవుడి గుండె పగులుతుంది
ఎక్కడో దూరాన కొలువై
ఉన్నావు
ఇక్కడ మా తలరాతలు
రాసేస్తున్నావు
నీకేం తెలుసు ఇక్కడి
వెతలు
గుండెలు పిండే బాధలు
ఎన్నడైనా చూసావా
ఎప్పుడైనా వచ్చావా
అన్నీ సరిగ్గానే
చేస్తున్నా అనుకుని
ఏదేదో చేసేస్తావు
నువ్వు చేసేదే నిజమని
నీ రాతే న్యాయమని
అంతా నీ అధీనమని
నీకు తోచిందే
చేసేస్తావు
నీ బాటలో నడిస్తే
నిన్నే నమ్ముకుంటే
కన్నీళ్ళే కానుకగా
ఇస్తావు
నీ పేరు చెప్పుకుని
మేమే దైవాంశ
సంభూతులమని
గోతులు తీసేవారికి
సలాములతో సత్కరిస్తావు
ఎన్నడైనా తొంగి చూసావా
మా గుండె లోతుల్లోకి
ఎప్పుడైనా విన్నావా
మా మనసు భావాలని
అంతులేని వేదనల్ని
ఎందుకు చూడవు
ఎందుకు కానవు
తప్పు నీలోనే వుంది
లోపం నీ దగ్గరే వుంది
ఎక్కడో కూర్చుని
ఇక్కడి వెతలను
తెలుసుకోలేక
ఎక్కడలేని అవగాహన
లోపంతో
పిచ్చి పిచ్చి
నిర్ణయాలతో
అర్థం పర్థం లేని
రాతలతో
మా బతుకులతో
ఆడుకుంటున్నావు
దివిని వీడి ఒక్కసారి
భువికి దిగిరా
ప్రతి జీవినీ పలకరించు
ప్రతి మనసునూ తడిమి
చూడు
నా ఆశ నిజమై
దేవుడు భూమండలం చేరితే
ఆ దేవుడి గుండె కూడా పగిలిపోతుంది
మనస్వినీ
ReplyDeleteఏ కాయమూ లేని ఆసామి, గుండె కాయ మాత్రం ఉంటుందను కుంటే ఎట్లా ?
జిలేబి