మౌనంలో నువ్వూ శూన్యంలో నువ్వూ
నువ్వు నన్ను రోజూ
అడుగుతూనే ఉన్నావు
ఏమిటా మౌనమనీ
ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావనీ...
నీకు తెలియనిదా నా
మౌనం
నీ మదిని తాకనిదా నా
అంతరంగం...
నీకు తెలుసు నాకు
మౌనమంటే ఇష్టమనీ
ఆలోచనల సమూహమే నా
అంతరంగమనీ...
మౌనంగా నేనున్నా
శూన్యంలోకి చూస్తున్నా
నేను నీ చుట్టే ఉంటాను
నా అంతరంగంలో నీవే
ఉంటావు...
అవును
నీవు లేనే లేని ఆనాడూ
నీ చుట్టే నా భావాలు
నీవు నాతోనే ఉన్న
ఈనాడూ నీతోనే నా ముచ్చట్లు...
నీవు నమ్మలేవేమో గానీ
నిజంగా నిజమిది
నేను నీతోనే మాట్లాడుతాను
పులకించిన మనసునూ
నీతోనే పంచుకుంటాను
వికలమైన మనసునూ
నీ పాదాలకే
సమర్పించుకుంటాను...
అలా ఎందుకు జరిగింది
ఇలా ఎందుకు జరగలేదు
అలా జరిగితే బావుండేది
ఇలా జరిగితే అలా
జరిగేది
అన్నీ నీకే
చెప్పుకుంటాను
మాటల్లో కాదు
మౌనంలో...
మనసుకు కష్టమైనప్పుడూ
మనసెంతో
వికసించినప్పుడూ
కనులముందు కదలాడేది నీ
రూపమే...
నీపైనే నాకు కోపం
నువ్వంటేనే నాకు
అభిమానం
నా విజయమూ నీవే
పరాజయమూ నీవే
మౌనంలో నీతో కాక
ఇంకెవరిని పలకరిస్తాను
నాకంటూ ఎక్కడో దేవుడు
లేడు
మనస్వినీ...
No comments:
Post a Comment