Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 13 December 2016

మౌనంలో నువ్వూ శూన్యంలో నువ్వూ

మౌనంలో నువ్వూ శూన్యంలో నువ్వూ
నువ్వు నన్ను రోజూ
అడుగుతూనే ఉన్నావు  
ఏమిటా మౌనమనీ
ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావనీ...
నీకు తెలియనిదా నా మౌనం
నీ మదిని తాకనిదా నా అంతరంగం...
నీకు తెలుసు నాకు మౌనమంటే ఇష్టమనీ
ఆలోచనల సమూహమే నా అంతరంగమనీ...
మౌనంగా నేనున్నా
శూన్యంలోకి చూస్తున్నా
నేను నీ చుట్టే ఉంటాను
నా అంతరంగంలో నీవే ఉంటావు...
అవును
నీవు లేనే లేని ఆనాడూ నీ చుట్టే నా భావాలు
నీవు నాతోనే ఉన్న ఈనాడూ నీతోనే నా ముచ్చట్లు...
నీవు నమ్మలేవేమో గానీ
నిజంగా నిజమిది
నేను నీతోనే మాట్లాడుతాను
పులకించిన మనసునూ
నీతోనే పంచుకుంటాను
వికలమైన మనసునూ
నీ పాదాలకే సమర్పించుకుంటాను...
అలా ఎందుకు జరిగింది
ఇలా ఎందుకు జరగలేదు
అలా జరిగితే బావుండేది
ఇలా జరిగితే అలా జరిగేది
అన్నీ నీకే చెప్పుకుంటాను
మాటల్లో కాదు మౌనంలో...
మనసుకు కష్టమైనప్పుడూ
మనసెంతో వికసించినప్పుడూ
కనులముందు కదలాడేది నీ రూపమే...
నీపైనే నాకు కోపం
నువ్వంటేనే నాకు అభిమానం
నా విజయమూ నీవే
పరాజయమూ నీవే
మౌనంలో నీతో కాక ఇంకెవరిని పలకరిస్తాను
నాకంటూ ఎక్కడో దేవుడు లేడు
మనస్వినీ... 

అందమైన అబద్దం

అందమైన అబద్దం 

ఎవరైనా ఒక చిన్న అబద్దం
చెబితే బావుండేది
నీకు మేమున్నామని...
నొసటన చిట్లించి పెదాలతో
పలకరిస్తే బావుండేది
నువ్వు బాగున్నావా అని...
కాలికి తట్టు పెట్టినా
చేయూతనిస్తే బావుండేది
నిన్ను పడనీయమని...
కనులముందు మృత్యుదేవత
నర్తిస్తున్నా
జీవితం జతకలిస్తే బావుండేది
నేనింకా మిగిలే ఉన్నానని...

Friday 9 December 2016

ఇంకేం కావాలి నాకు

ఇంకేం కావాలి నాకు  

రగులుతున్న నీ ఆగ్రహంలో
నేను మండుతున్నంతకాలం
జారిపడుతున్న నీ కన్నీటిలో
నేను తడుస్తున్నంత కాలం
జాలువారుతున్న నీ కంటి వెన్నెలలో
నేను ఆడుకున్నంత కాలం
నీ పెదాల మధురిమలో
నేను మకరందమై కరిగినంత కాలం
హృదయస్పందనలు నీవైతే
నేను ఊపిరిగా మారినంతకాలం
ఆకురాలే కాలం నాదే
నవ్వుతున్న నీ వసంతం నాదే
మనసునిండా నిష్క్రమించేందుకు
ఇంతకన్నా నాకేం కావాలి
మనస్వినీ

Thursday 8 December 2016

జీవనమరణం

జీవనమరణం
చివుర్లు తొడుగుతోంది
ఎక్కడో ఒక భావం...
కలవర పడుతోంది
ఎదలోతుల్లో ఒక అక్షరం...
విచ్చుకుంటోంది
చితిమంటలలో ఒక పుష్పం...
రెక్కలు విప్పుతోంది
నిశి తెరలలలో ఒక కవనం...
మనసును పలకరిస్తోంది
వెకిలినవ్వుతో నైరాశ్యం...
కనులముందే జారిపోయింది
కనుపాపల ఓ స్వప్నం...
జీవిస్తూ నిత్యమరణం ఎందుకు
మరణించి జీవించమని
దీవిస్తోంది మానసం...

Thursday 1 December 2016

గొడుగు

గొడుగు
నా గొడుగుకి చిల్లులు పడ్డాయి
అక్కడక్కడా వానచినుకులు
ఒంటికి తాకుతున్నాయి
సూర్యుని వాడివేడి కిరణాలు
దేహాన్ని కాల్చుతున్నాయి
సిద్ధాంతాల వాసన
ముక్కుపుటాలను తాకుతోంది
బూజుపట్టిన ఆదర్శాలు
మసక బారుస్తున్నాయి
గొడుగువంటి నా మనసును
నేను మార్చుకోను
ఎందుకంటే
ఏ ఎండాకా గొడుగు పట్టే
అలవాటు నాకు లేదు