Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 13 May 2017

నీతోనే ఉన్నా

నీతోనే ఉన్నా
నాతోనే ఉంటావు నువ్వు
నాతో లేనే లేవనిపిస్తోంది
నీ లోకం నీది
నాలోకం నాది
ఆలోచనల అంతరంగాలు
మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే
నాదో నీదో తెలియని లోకంలో
భావమాలికలు అల్లుకుంటూ ఉంటాను నేను
అదేమి చిత్రమో తెలియదు కానీ
నా అంతరంగ వలయాలన్నీ నీ చుట్టే
నీలోకం పరదాలు తొలగించి
నువ్వు నన్ను పలకరించినా
అందంగా నవ్వినా
మంద్రంగా పలకరించినా
అది నాకు సరిపోలేదని అనిపిస్తుంది
నా చెంత నువ్వు లేని వేళ
నా పక్కనే ఉన్నావనిపిస్తుంది
నన్ను పలకరించినట్లు
కొంటెగా కవ్వించినట్లు
నా చెవులకు తీయగా వినిపిస్తుంది
నువ్వు నన్నే పలకరిస్తున్నట్లుగా
మనసుకు ఇది భ్రాంతియేనా
నిజం అబద్దంగా
అబద్దం నిజంగా
అనిపిస్తున్నది ఎందుకు
నిజం చెప్పు నువ్వు నాతోనే ఉన్నావా
నేను నీతోనే ఉన్నానా
నిజమేదో అబద్దమేదో తెలియదుకానీ
నేను మాత్రం నీతోనే ఉన్నా
మనస్వినీ 

Friday, 12 May 2017

నవస్వప్నం

నవస్వప్నం

ప్రభాత సుందర వేళ
నిశిదుప్పటి జారిపడిన వేళ
తొలికిరణాల వెచ్చని పలకరింపు సాక్షిగా
జనియిస్తున్నా ప్రతి ఉదయం
అందమైన స్వప్నంలా
వేకువను వెన్నెల కమ్ముకుంటే
నింగి తారకలను మనసులో దాచుకుంటూ
కనులుమూస్తున్నా
అనివార్యమైన మరణంలా
జననం నుంచి  మరణంలోకి
మరణం నుంచి జననంలోకి
ప్రతిరోజూ జారిపోతున్నా
ఉషస్సును పలకరించే సంధ్యలా
జననమో మరణమో తెలియని వేళల్లో
ప్రతి ఉదయం కొత్త ఊపిర్లు నింపుకుంటున్నా
ప్రాణం పోసుకున్న నవస్వప్నంలా

Thursday, 11 May 2017

భావమాలికల సింగారం

భావమాలికల సింగారం

ప్రభవించిన నా స్వప్నాలను
నీ కురులలో పువ్వులుగా అల్లుకున్నాను
నవ్వుతున్న పువ్వులలో
నా కవితలను దాచుకున్నాను
రాలిపడుతున్న కవితా పుష్పాలను
నా గుండెలో అదుముకున్నాను
కవితలు నిండిన నా మనసును
నీ నుదుటిపై చుక్కలా దిద్దుకున్నాను
విరిసిన నీ పెదాలపై
నా భావాలను అద్దుకున్నాను
జారిపడుతున్న నవ్వులలో
నా కలలను ఏరుకున్నాను
నీ కనుల జారే వెన్నెలలో
తారకలను దాచి పెట్టాను
ఒకటేమిటి
నీ నఖశిఖ పర్యంతం
నా భావమాలికలతో సింగారించుకున్నాను
మనస్వినీ

Monday, 8 May 2017

జన్మదిన శుభాకాంక్షలు చిట్టితల్లీ

జన్మదిన శుభాకాంక్షలు చిట్టితల్లీ

నీ వీక్షణం నోచుకోలేదు
నీ ముద్దుమాటల సవ్వడి చెవులకు తాకలేదు
నీ తప్పటడుగులు చూడనే లేదు
అనునిత్యం నీ అనుభూతులు
కళ్ళముందే కదులుతున్నాయ్
ముద్దుగా ముదు ముద్దుగా
చలాకీగా చిరునవ్వులు చిందించే నువ్వు
ఎప్పుడూ నా భావనల్లో
చిన్నారి దేవతలా
మా జీవన సామ్రాజ్యంలో యువరాణిలా
వెలుగులు చిందిస్తూనే ఉంటావ్
చిట్టి తల్లీ
నీకు ఇవే నా హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు