Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 28 April 2020

నీకు సలాం మనస్వినీ


నీకు సలాం మనస్వినీ
నువ్వొక అద్భుతం
నిజంగానే నువ్వొక ఆశ్చర్యం...
నిన్ను చూస్తుంటే
నీగురించి ఆలోచిస్తుంటే
భావాలకు అందని నీ వ్యక్తిత్వం కనిపిస్తోంది...
పూర్తిగా విరుద్ధమైన భావజాలం నుంచి, ఏమాత్రం పొసగని సాంప్రదాయాలనుంచి
నా జీవితంలోకి అడుగిడినావు...
సంఘర్షణాత్మక ఆలోచనా పరిధులను దాటి
ఒక పటిష్ఠమైన భావజాలాన్ని నిర్మించుకుని
నేను ఆచరించే జీవనవిధానాన్ని అక్కున చేర్చుకుని నాకే తెలియని
మార్గానికి దిక్సూచివయ్యావు...
ఎలాంటి ఒత్తిళ్లకు లొంగని
మనోధైర్యంతో
నా మతాన్ని నాకంటే బాగా ఆచరిస్తూ నాకే పాఠాలు నేర్పుతున్న నిన్ను చూసి అబ్బురపడకుండా ఎలా ఉండగలను చెప్పు..
మామూలుగా రంజాన్ మాసంలో ఆధ్యాత్మికతను పెద్దగా పాటించని నాకు
నీ ఉపవాస దీక్షలు ఒక అద్భుతంగా కనిపించడంలో తప్పు లేదు కదా...
ఇలా ఉండు అలా ఉండు అని నీపై ఏనాడూ ఆంక్షలు పెట్టని నాకు ఎలా ఉండాలో ఆచరించి చూపుతున్న నీకు
శిరస్సువంచి ప్రణమిల్లడం తప్ప ఎలా కృతజ్ఞతలు చెప్పుకోను మనస్వినీ...

Monday, 27 April 2020

కుప్పకూలిపోతానేమో


కుప్పకూలిపోతానేమో

ఇప్పుడే రాదు
ఇప్పట్లో రానే రాదు
కానీ తరుముకు వస్తుంది ఆ ఘడియ
ఏనాటికైనా నన్ను పలకరిస్తుంది ఆక్షణం
నా ప్రాణాన్ని నానుంచి తీసుకెళ్లడానికి రానే వస్తుంది ఆ నిమిషం...
విద్యుత్ దీపాల కాంతిలో
బంధుమిత్రుల కోలాహలంలో
వసంతమై వచ్చి విషాదమై గుచ్చి
నాప్రాణాన్ని తోడేస్తుంది ఆ సమయం...
అవును అది నా బంగారుతల్లి పెళ్లిగడియ
తలుచుకుంటే ఇప్పటినుంచే మనసంతా వికలమై నా ప్రపంచం నాకు దూరమైనట్టు అనిపిస్తోంది
నా గుండెలపై ఆడుకుని
నవ్వులపువ్వులను
పరిచయం చేసిన నా గారాలపట్టి పెళ్ళికి ఇంకా చాలా సమయమే ఉంది
అయినా ఎందుకో ఆ ఆలోచనే మనసును వికలం చేస్తోంది
ముఖ్యంగా నీల్ కమల్ సినిమాలో రఫీ గళం నుండి
జాలువారిన బాబుల్ కి దువాయే.. గీతం విన్నప్పుడల్లా నాలో కన్నీటి సుడులు రాబోయే ఆ ఘడియలను కళ్ళముందు
నిలబెడతాయి
ఏమో కుప్పకూలిపోతానేమో
ఆఘడియలో....

Tuesday, 21 April 2020

భయకంపిత మానసం


భయకంపిత మానసం

హృదయ కవాటంలో
చిన్న కదలిక ఏదో పుడుతోంది
సన్నని ప్రకంపనలేవో
మనసును కమ్మేసేలా ఉన్నాయి
బండరాయి నా మనసని అనుకున్నా
కానే కాదు అది మంచుముద్దలా కరిగిపోతోంది
కలల పుట్టిళ్లు నా కనులు
భావరహితమవుతున్నాయి
సుడులు తిరుగుతున్న భావాలేవో మసకబారుతున్నాయి
గుచ్చుకునే నా కళ్ళు
పిచ్చిచూపులు చూస్తున్నాయి
కాగడాలా దారి చూపే నా ధైర్యం గాలిలో దీపమై బిక్కుబిక్కు మంటోంది
మనసుకు ఏమయ్యిందో గానీ తెలియని భయమేదో
తరుముతూనే ఉంది
మనస్వినీ...

ఆశ...

ఆశ...

రెక్కలు విచ్చుకున్న ఆలోచనలు
మనసును లాగుతున్నాయి
నింగివైపు దూసుకెళదామని...
పులకించిన మనసు ఉరకలు వేస్తోంది వెలుగురేఖలను ముద్దాడాలని...
ఇనుప సంకెలలు ఏవో పాదాలను
పెనవేస్తున్నాయి
అంత స్వేచ్ఛ నీకెందుకని...
ఆశ చావని కన్నులు
ఆకాశాన్ని అంటుతున్నాయి
ఆ నింగిని పాదాక్రాంతం
చేసుకోవాలని...

Sunday, 19 April 2020

నా ఊపిరివై నడిచిరా..


నా ఊపిరివై నడిచిరా..

నీగురించి ఏమని రాసుకోను

నాకు నువ్వెంత ముఖ్యమో
ఎలా వివరించను
నీతో నడుస్తూ ఉంటే ఎంతదూరమైనా నడవగలను అలుపెరుగని
బాటసారిలా
కాలం గడిచిపోతుంది కానీ
నీతో నడిచిన జ్ఞాపకాలు
విరబూస్తూనే ఉంటాయి
రజనీగంధ పుష్పంలా
అందరున్నా
ఎందరు మురిపిస్తున్నా
నువ్వు నా కనులముందు
నవ్వుతూ ఉంటే చాలు
నా లోకమంతా నవ్వుతూ ఉంటుంది పండు వెన్నెలలా
చిరునవ్వులు చిందించు
నాలో జీవాన్ని నింపుతూ
ఎందుకంటే
ఆగిపోయే శ్వాసను నేనైతే
నాలో ప్రవహించే ఊపిరి నువ్వే మనస్వినీ...

Friday, 17 April 2020

చావు భయం...


చావు భయం...
ఆంక్షలు ఇంకా కొనసాగించాలని కోరుతున్నావు నువ్వు
సడలిస్తేనే బతుకని అంటున్నాను నేను...
పచ్చనోట్ల కట్టలపై నిదురిస్తున్నావు నువ్వు
కాలే డొక్కల చప్పుళ్లలో
నిద్రలేని రాత్రులు నాకు...
బయటికి ఎళ్ళకున్నా
అన్నీ అందుబాటులోనే నీకు
అడుగుతీసి అడుగు వెయ్యకపోతే పైసా పుట్టదు నాకు...
ఇంటినుంచి పనంటూ జీతం తీసుకుంటావు నువ్వు
పనిచ్చేటోడు లేక బిక్కు బిక్కు మంటున్నా నేను...
పలకరిస్తే అందరూ ఆదరిస్తారు నిన్నూ
ఎక్కడ అప్పులు అడుగుతానో అని తప్పించుకుంటారు నన్ను...
ప్యాకేజీలు ఫార్ములాలు నిలబెడతాయి నిన్ను
ఎవరికీ కానరాక కూలిపోతున్నా నేను...
ఆంక్షలు సడలిస్తే దూసుకుపోతావు నువ్వు
కాలిబాటన గమ్యంలేని దూరాలకు పయనిస్తా నేను...
అయినా మనిద్దరి భయం ఒకటే...
ఆంక్షలు సడలిస్తే కరోనా చంపేస్తదని భయం నీకు
సడలించకపోతే ఆకలి చంపేస్తదని భయం నాకు...
సగటు జీవిని నేనైనా
బడాబాబువి నువ్వైనా
మనిద్దరికీ చావు భయం పట్టుకుంది ఇదే నిజం...

Thursday, 16 April 2020

ఏం జరుగుతోంది?


ఏం జరుగుతోంది?
ఎక్కడో ఎండుటాకుల సవ్వడి చెవులను తాకుతోంది...
అదిగో చూడు సుడిగాలిలో రేగిన నింగి ధూళి ఆకాశాన్ని తాకేందుకు నానా పాట్లు పడుతోంది..
ఎందుకో ఏమో
కళకళలాడే ఓ జలాశయం ఎండమావిలా మెరుస్తోంది...
ఆ గులాబీకేమైయిందో
గుభాళింపులను విసిరేసి
రెక్కలను ముడుచుకుంటోంది...
చెట్టును వీడి నేలరాలుతున్న
పండుటాకు ఒకటి
నన్ను చూసి పగలబడి
నవ్వుతోంది...
ఏదో తెలియని సంక్షోభం
కనులముందు కదలాడుతోంది...
చేసేదేమీ లేదంటూ
మనసుమూగబోతోంది...

Friday, 10 April 2020

అగ్నిపర్వతమై...


అగ్నిపర్వతమై...
సుస్వరాలు పలికే
వీణ తంత్రులు తెగిపోయినట్లు
హాయిగా పాడే కోయిల
గొంతు మూగబోయినట్లు
తీయని సవ్వడి చేసే
చిరుగాలి అలిగినట్లు
మిరుమిట్లు గొలిపే దీపాలను నిశి రక్కసి మింగేసినట్లు
మౌనపుష్పమైన మనసుపై
ఆలోచనల కందిరీగలు ముసిరినట్లు
గడ్డకట్టిన కాలంపై నిశబ్ద తివాచి పరిచినట్లు...
సుడులు రేపే మౌనంలో చిరునవ్వులు కొట్టుకుపోయినట్లు
మౌనం దాల్చిన మానసం
నిశ్శబ్దాన్ని చీల్చినట్లు
ఏమో
రగులుతున్న యవనికపై
ఒక అగ్నిపర్వతమై
పేలిపోతానేమో...