అన్నీ నా భావాలే
ఎంతటి చోరులు ఈ
భావకులు మనస్వినీ
నీ నుండి అన్నీ
తస్కరించేసారు
వాలిన నీ కనురెప్పలను
చూసి
నా అనుభూతుల పరంపరకు
అక్షర రూపం ఇవ్వబోతే
నా భావాలను మించిన
కవితలెన్నో
రాసేసారు మనస్వినీ
నీ తేనీయ పెదాల
పొందికనుంచి
జాలువారే మధురసాలను
సిరాగా మలుచుకుంటే
ఎవరో ఆ మనసు కవి
నాకంటే ముందుగానే
అక్షర కుసుమాలు సాగు
చేసాడు మనస్వినీ
నీ కన్నుల వెన్నెలలో
ఆడుకుని
అక్షరాలతో సేదతీరాలని
అనుకున్నా
వెన్నెల్లో ఆడపిల్ల
అంటూ
ఎవరో రాసిన తీపి
అక్షరాలు పలకరించాయి
నీ మనసులో దూరి
మనసు భావం గాంచి
అక్షర ముత్యాలతో
మనసుకు
అభిషేకం చేయాలని
అనుకున్నా
కవిరాజు ఎవరో
మనసు సొదలన్నీ గేయాలుగా
కూర్చాడు మనస్వినీ
ఎంతటి మహా చోరులు ఈ
భావకులు
నిన్ను చూసి నాలో
మెదిలిన భావాలను
నాకంటే ముందుగానే
గ్రహించి
కవితలెన్నో
అల్లుకున్నారు
మనస్వినీ
No comments:
Post a Comment