ఏదీ మారలేదు
తూరుపున ఉదయించే
సూరీడు
పడమరనే
అస్తమిస్తున్నాడు
చల్లని చందమామ
వెన్నెలే కురిపిస్తున్నాడు
ఆకాశంలో మబ్బులు
హాయిగా విహరించే
విహంగాలు
చీకటి పొడిస్తే మిలమిల
తారకలు
అన్నీ మామూలుగానే
కనిపిస్తున్నాయి
అదే ఎండ
అవే చల్ల గాలులు
పులకరించే పిల్లగాలులు
వాన నీటి తుంపరలు
మట్టి వాసన మధురిమలు
మనసు హాయిగానే
సేదతీరుతోంది
తీపి చేదుల జీవనంలో
అన్ని రుచులూ
సమపాళ్ళలోనే ఉన్నాయి
ఏ రుచీ తగ్గలేదు
మరో రుచి పెరగలేదు
మధురిమలన్నీ మధురంగానే
ఉన్నాయి
పడమర ప్రభాతం
కానరాలేదు
చందమామ నిప్పులు
కురిపించలేదు
కాలమేదీ ఆగిపోలేదు
రుతువులేవీ మారిపోలేదు
గడియారం ఆగలేదు
పరుగుల పయనం ఆగిపోదు
మారిందల్లా ఒకటే
సంకల్పం మరింత పటుతరం
మనస్వినీ
No comments:
Post a Comment