శాంతి మందిరం
ఆనందం ఎక్కడుంది
ఆహ్లాదం ఎక్కడ దాగుంది
ప్రశాంతత ఎక్కడ
కరిగిపోయింది
అంతులేని ధనరాశులలోనా
అందమైన విహార
క్షేత్రాలలోనా
సుందర నందన విడిది
కేంద్రాలలోనా
కనుసైగకే వాలిపోయే
మందీ మార్బలంలోనా
రెక్కాడితేగాని డొక్క
నిండని పూరి గుడిసెలలోనా
చాలీ చాలని బతుకుల
బడుగుజీవులలోనా
చిరిగిన బట్టల
సొంపులలోనా
విరిగిన పాదుకల సవ్వడిలోనా
చెదిరిన జీవితాల
చరితంలోనా
ఎక్కడుంది ఆనందం
ఎక్కడ దాగింది ఆహ్లాదం
ఏ పుడమిన కలిసింది
ప్రశాంతం
గుండె కవాటం తెరిస్తే
విరిసిన మనసును
కదిలిస్తే
పెదాల ధారపై సుధలే
కురిస్తే
ప్రతి హృదయమూ
ఒక శాంతి మందిరమే
మనస్వినీ
No comments:
Post a Comment