నా బాల్యం తిరిగివస్తోందా...?
ఏమో అవుననే అనిపిస్తోంది...
చిన్నప్పుడు నాన్నతో జ్ఞాపకాలు చాలా తక్కువే.. అప్పట్లో నాన్న ఇచ్చే పదిపైసలు ఎంతో
అపురూపం.. నాన్న పదిపైసలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూసే వాడిని.. ఆ పదిపైసలతో నాకిష్టమైన
చిరుతిళ్ళు కొనేవాడిని. నాన్న తొందరగానే వెళ్లిపోయారు. తర్వాత పెద్దన్నయ్య నెలకోసారి
తెచ్చే ఖలాకంద్ స్వీట్ కోసం ఎదురుచూసే వాడిని..
ఇక దీపావళి వచ్చిందంటే చిన్నన్న తెచ్చే టపాసులకోసం వారం ముందు నుంచే ఎదురుచూడటం నాకలవాటు.
ఎలాగైతేనేం చాలావరకు సరదాలు తీరకుండానే గడిచిపోయింది నా బాల్యం.ఇరుగుపొరుగు పిల్లల
సరదాలను చూస్తూ మాకెందుకు లేదు ఇలాంటి జీవితమనుకుంటూ కష్టాలతో ఎదురీదుతూ బాల్యాన్ని
దాటేసా.. తర్వాత జర్నలిజంలో స్థిరపడ్డాక నా పిల్లలకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రానీయలేదు.
వాళ్ళు అడగకముందే అన్నీ కొనిచ్చా. ఆఫీసునుంచి వస్తున్నా అంటే ఇంటికి ఏదో ఒకటి పట్టుకు రావడం అలవాటుగా మారిపోయింది.
సరే ఇది చాలామంది చేసేదే ఇందులో నా గొప్ప ఏమీలేదని తెలుసు.. ఎందుకో ఇప్పుడు నా మానసిక
పరిస్థితి మారిపోయింది.. అచ్చం చిన్న పిల్లాడిలా ఆలోచిస్తున్నా. ఆ మధ్య మా వాణీ బయటినుంచి
వచ్చి నా పక్కన ఒక పార్సిల్ పెట్టింది. వావ్ నాకోసం kfc చికెన్ తెచ్చింది అని సంబరపడ్డా. కాకపొతే అది ఫుడ్డు
కాదు. మా వాణీ నాకోసం తరచుగా kfc తెస్తుంటుంది
కదా అందుకే అలా అనుకున్నానేమో అని నాకు నేను సర్ది చెప్పుకున్నా.. కానీ నిజం ఏమిటంటే
నా మనసు చిన్నపిల్లాడిలా ఇలాంటివి కోరుకుంటోంది. అంతెందుకు వాణీ ప్రతిశుక్రవారం సాయంత్రం
కూరగాయల మార్కెట్ కు వెళుతుంది. కూరగాయల మార్కెట్ కు వెళ్లిందా అంటే నాకు తినడానికి
ఏదో తెస్తోంది అనుకుంటూ ఎదురుచూడటం అలవాటైపోయింది. నిజానికి ఈ నా మనస్సును నా వాణీ
పసిగట్టిందేమో అలా వెళ్ళినప్పుడల్లా నేను చిన్నప్పుడు ఇష్టపడినవన్నీ నాకు తెచ్చిస్తోంది. ఎందుకో నాకు తను ఆ సమయంలో అమ్మలా కనిపిస్తుంది.
ఎంతో మురిపెంగా అవన్నీ దాచుకుని మరీ తింటుంటా.. ఎప్పుడైనా అలాంటివి తేకపోతే లోలోపల
అలగటం కూడా మొదలయ్యింది. ఇక తాజాగా ఈరోజు ఆఫీసులో ఉన్న మా అబ్బాయికి ఫోన్ చేసి డాడీ ఫిష్ తినాలనిపిస్తోంది అని అడిగేసాను. ఈమధ్య మా
పాపతో మమ్మూ ఏమన్నా తినాలనిపిస్తోంది అని అడిగేస్తున్నా. తను బేకరీ నుంచి క్రీమ్ బన్
తెచ్చిస్తే అపురూపంగా తినేస్తున్నా.. ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నానో నాకే తెలియటం
లేదు కానీ చేస్తున్నా.. నా అదృష్టం బాగుండి మా అమ్మ తర్వాత అమ్మలా నా వాణీ నా బొజ్జ
నింపడమే పనిగా పెట్టుకుంది. మా వాడైతే ఇంట్లో ఉన్నంత సేపు డాడీ ఏమన్నా తెప్పించనా అని
పదే పదే అడుగుతుంటాడు. చిన్న దగ్గు వచ్చినా నా బంగారు తల్లీ కలవరపడుతోంది. విషయం ఏమిటంటే
వీటన్నింటినీ నా మనసు ఎంజాయ్ చేస్తోంది. ఇది చిన్న పిల్లల మనస్తత్వం కాకపోతే ఏంటి.. ఇలా ఎందుకు జరుగుతోంది..ఆర్ధికంగా బలహీనుడిని కావడం వల్ల ఇలా ఆలోచిస్తున్నానా.. నా
వాళ్ళే కదా నాకు చేయాల్సిందే అనే ఆలోచనా... ఎందుకిలా ఆలోచిస్తున్నా... నేను నావాళ్ళ
అవసరాలు తీర్చాలి కానీ నా చిన్నచిన్న ఆశలకోసం మనసు ఎందుకు మారాం చేస్తోంది. వృద్ధాప్యంలో బాల్యం వస్తుంది అని అంటారు. మరి నాకు
యాభై ఏళ్ళేగా.. నా బాల్యం కోయిల ముందే కూస్తోందా..?
మనస్సులో చిన్నపిల్లల్లా నిష్కల్మషంగా ఉండగలవారు ఎంతో అదృష్టవంతులు.
ReplyDeleteధన్యవాదములు సర్
Delete