మనసుదుప్పటి కప్పనా
మండుటెండలో
ఎడారి వీధుల్లో ఒంటరిగానే నడుస్తున్నా
నాపక్కనే నడుస్తున్నట్టుగా
అందమైన పాదాల ముద్రలు
నాతో నువ్వే నడుస్తున్నావనిపిస్తోంది
మరి నీ పాదాలకు గొడుగుపట్టనా
ప్రియతమా...
కటికచీకటిలో నిశాచర జీవినై
భయపడుతూనే ముందుకు నడుస్తున్నా
నా చెవుల్లో ఏదో మంద్రమైన సవ్వడి
నువ్వే గుసగుసలాడున్నావనిపిస్తోంది
ధైర్యమై నువ్వు తోడు
నిలిచావనిపిస్తోంది
నేస్తమా...
ఎండుటాకుల నడుమ నడక నేర్చిన నేను
శిశిరంలోనూ అడుగులు వేస్తున్నా
ఎముకలుకొరికే చలిలో ముందుకే
నడుస్తున్నా
ఏదో తెలియని నులివెచ్చని శ్వాస
నువ్వు సహచర అడుగులు
వేస్తున్నావనిపిస్తోంది
చలిలో వణికే నీ నీడకు
మనసుదుప్పటి కప్పనా
ప్రాణమా...
కాలానికి అతీతమైన బాటసారికి
నీ అడుగులజాడలు
పూలబాటలు కావా
జీవితమా...
No comments:
Post a Comment