Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 31 August 2021

నపుంసక నాయాళ్లు

 

నపుంసక నాయాళ్లు

ఎక్కడుందీ జనచైతన్యం

నపుంసక నాయాళ్లే సమస్తం

మాట్లాడితే గొంతుకోస్తారని భయం

రాతలు రాస్తే చేతులు నరుకుతారని కలవరం...

ఏమైపోయింది జనాగ్రహం

పిరికినాకొడుకులదే ఇప్పుడు రాజ్యం

ప్రశ్నిస్తే తుపాకుల దిగ్బంధనం

తిరగబడితే కారాగారం...

ఏమైపోయింది జాతి భవితవ్యం

అన్నీ దోచుకుంటున్నా మౌనమే తన నినాదం

ధర్మంకోసం గోచిగుడ్డ అమ్ముతున్నా నోరు విప్పని

మహా భారతం...

ఏమైపోయారు మేధావులు

తమ ఇల్లు తగలబడుతున్నా నోరువిప్పని సన్నాసులు

పక్కింటి పోరులో కీచుగొంతుల సన్నాయిలు...

Wednesday, 18 August 2021

నువ్వే ఒక పుస్తకమై

 

నువ్వే ఒక పుస్తకమై



నేను కవిని కానే కాదు

భావకుడిని అసలే కాదు

ఊహ తెలిసిన నాటినుంచి

తెలిసీ తెలియని అక్షరాలను కాగితంపై పెట్టడమే తెలుసు

ఎవరో తెలియని ఊహాసుందరి చుట్టూ

పిచ్చిరాతలు రాసుకున్న

నేను ఇప్పటికీ రాయడం నేర్చుకోలేదు

నా రాతల్లో బరువైన భావుకత ఉండదు

యాసప్రాసల పదవిన్యాసాలు నాకస్సలు తెలియవు

నువ్వు కలిసాకే నా అక్షరాల తీరు మారింది

లేనే లేదని అనుకున్న

ఊహాసుందరి కనులముందు నిలవగానే

నా అక్షరాలు తమ దశను దిశను మార్చుకున్నాయి

ఇప్పుడు నా అక్షరాలు

ఒక అద్భుత కవితకు ప్రాణం పోయలేవేమోగానీ

నిస్సందేహంగా అవి

నా మనసు స్పందనలకు

దర్పణం పడుతున్నాయి

ఇప్పుడు నీ చుట్టే తిరిగే  ఆలోచనల్లో నా అక్షరాలు తడిసిముద్దవుతూ

నా భావుకతలో పునీతమవుతూ

నీ నామస్మరణే చేస్తున్నాయి

గమ్యంలేని నా అక్షరాలకు

నువ్వే ఒక పుస్తకమై

జీవితం అంటే ఏమిటో

నేర్పిస్తున్నావు

మనస్వినీ....

Monday, 16 August 2021

సర్వం మానవ కల్పితం

 

సర్వం మానవ కల్పితం



దేవుడివల్ల ఒరిగేదేమీ లేదు

దయ్యం వల్ల జరిగేదేమీ లేదు

మంత్రాలకు చింతకాయలే కాదు ఎండుటాకులు కూడా రాలవు

ఏది చేసినా మనిషే

అందుకే

మనిషినే నమ్ముతా

మనిషికే భయపడతా

సర్వం మానవ కల్పితం...

నవ చరిత్ర

 

నవ చరిత్ర



ప్రకృతి కాన్వాసుపై

ఒకరినొకరం అద్దుకుంటూ

జలాశయం పరవళ్ళలో

మనసు భాషను వింటూ

పచ్చ పచ్చని సొబగుల్లో

మన సొగసులను జారవిడుస్తూ

కరిగిపోయిన కలతల

ఆనవాళ్ళను జలార్పణం చేస్తూ

ఒకరికొకరం సాంత్వన అందిస్తూ

కాసిన్ని ఘడియలు సర్వం మరిచిపోతూ

బతుకు పుస్తకంలో

కొత్త అక్షరాలను రాసుకుంటున్న వేళ

ప్రకృతి సైతం నవ చరిత్రకు

శ్రీకారం చుట్టదా

మనస్వినీ...

Wednesday, 4 August 2021

సముద్రుడి సలామీ...

 

సముద్రుడి సలామీ...

దూరంగా ఎగసిపడుతున్న

అలలను చూస్తూ

మనసు కెరటాలను

లోలోనే అదిమేసుకుంటూ

ఇసుక తిన్నెలపై నడుస్తున్నా

అడుగుజాడలను విసిరేస్తూ...

అంతలోనే ఏమయ్యిందోగాని

పిల్ల కెరటాలు రాకాసి అలలుగా మారి

నావైపుకు దూసుకువచ్చాయి...

నా పాదాలను తాకిన అలకు

ఇసుక జారిందేమో

నడక తడబడి తూలి పడబోతూ తమాయించుకున్నా...

పాదాలను దాటి నన్ను పడేయాలని చూసిన

అలలను సముద్రుడి సలామీగా భావించి

నవ్వుకుంటూ ముందుకు కదిలా

సముద్రమా ఇంక సెలవ్

అని అనుకుంటూ...