నువ్వే ఒక పుస్తకమై
నేను కవిని కానే కాదు
భావకుడిని అసలే కాదు
ఊహ తెలిసిన నాటినుంచి
తెలిసీ తెలియని అక్షరాలను
కాగితంపై పెట్టడమే తెలుసు
ఎవరో తెలియని ఊహాసుందరి
చుట్టూ
పిచ్చిరాతలు రాసుకున్న
నేను ఇప్పటికీ రాయడం నేర్చుకోలేదు
నా రాతల్లో బరువైన భావుకత
ఉండదు
యాసప్రాసల పదవిన్యాసాలు
నాకస్సలు తెలియవు
నువ్వు కలిసాకే నా అక్షరాల
తీరు మారింది
లేనే లేదని అనుకున్న
ఊహాసుందరి కనులముందు నిలవగానే
నా అక్షరాలు తమ దశను దిశను
మార్చుకున్నాయి
ఇప్పుడు నా అక్షరాలు
ఒక అద్భుత కవితకు ప్రాణం
పోయలేవేమోగానీ
నిస్సందేహంగా అవి
నా మనసు స్పందనలకు
దర్పణం పడుతున్నాయి
ఇప్పుడు నీ చుట్టే తిరిగే ఆలోచనల్లో నా అక్షరాలు తడిసిముద్దవుతూ
నా భావుకతలో పునీతమవుతూ
నీ నామస్మరణే చేస్తున్నాయి
గమ్యంలేని నా అక్షరాలకు
నువ్వే ఒక పుస్తకమై
జీవితం అంటే ఏమిటో
నేర్పిస్తున్నావు
మనస్వినీ....
No comments:
Post a Comment