తప్పెవరిది?
మీడియా వార్తల కవరేజి తీరు
చూస్తే సామాన్య ప్రేక్షకుడిగా నాకు మండిపోతోంది. చిన్నారిపై అఘాయిత్యం, హత్య, మరెన్నో
దారుణాలు వదిలేసి ఒక సినిమా హీరో యాక్సిడెంట్ వార్తను విపరీతంగా కవర్ చేస్తున్నారు.
గంటకోసారి హెల్త్ బులెటిన్, అతను కళ్ళు తెరిచాడా లేదా తుమ్మాడా , పక్కకు కదిలాడా వంటివి
ప్రతిదీ అప్ డేట్ చేస్తున్నారు.. ఆ చిన్నారి హత్యాచారం గాని మరో దారుణం గానీ అంతగా
ప్రాధాన్యతకు నోచుకోలేదు.. అయితే ఇది మొదటి సారి కాదు. సినిమా వాళ్ళ ఇష్యూ ఉన్నప్పుడు
మీడియా సంస్థలు నిజంగానే ఇతర వార్తలను పక్కకు పడేస్తున్నాయి.. ఇదేం పద్దతి ఛానల్స్
వాళ్లకు జనం గోడు పట్టదా? ఎంతసేపూ ఆ సినిమా వాళ్ళ గోలేనా అని సోషల్ మీడియాలో రాసుకుని
ఆవేశపడిపోతుంటాం... అయితే దీనికి కారణం ఏంటి? మీడియా ఇలా ఎందుకు చేస్తోంది? మీడియాకు
సామాన్యుడి బాధ పట్టదా అని అంటే ఎందుకు పట్టదు
జనం చూస్తున్నారు గనుకే ఆ వార్తలకు ప్రాధాన్యత పెరుగుతోందని అంటాను నేను. సుధీర్ఘకాలంగా
ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసిన అనుభవంతో చెబుతున్నా జనం అలాంటి వార్తలే చూస్తున్నారు..
సినిమావాళ్ళ వార్తలకే TRP వస్తోంది ఇది నిజంగా నిజం. వారం వారం రేటింగ్ తీరు విశ్లేషస్తే
సినిమా సంబంధిత వార్తలకే ఎక్కువ రేటింగ్ వస్తోంది. మినిట్ టు మినిట్ రేటింగ్ చూస్తే
సినిమా క్లిప్పింగ్ తో ఒక్క నిమిషం వార్త నడిచినా దానికే రేటింగ్ వస్తోంది. పక్కా న్యూస్
ఛానెల్ లో సినిమా వార్తలు, సినిమా గాసిప్స్, సినిమా ట్రైలర్లు, కొత్త పాటల క్లిప్పింగ్స్
తో నడిచే కార్యక్రమాలు ఎందుకు ప్రసారం చేస్తున్నారు. జస్ట్ తమ TRP పెంచుకోవడానికే...
ఇక హీరోలకు యాక్సిడెంట్ అయితే కళ్లప్పగించి చూసేయడం ప్రేక్షకులకు చాలా ఇష్టం.ఆ హీరోకు
యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ముందు మీడియా పాయింట్ పెట్టి మరీ కవరేజ్ ఇస్తున్నారంటే
వాళ్ళకేమన్నా పిచ్చా... కానేకాదు జనం విరగబడి చూస్తున్నారు గనుకే ఆ వార్తలను నడుపుతున్నారు..
విషయం ఏమీ లేకున్నా కురచబట్టలు వేసుకున్న ఓ ముద్దు గుమ్మ పిక్స్ తో గాసిప్ నడిపినా
చొంగ కార్చుకుని చూసే ప్రేక్షకుడు ఇతర వార్తలు రాగానే ఛానల్ మార్చేస్తాడు.. ఇక ఇంట్లో
భార్యాభర్తల పంచాయితీ, అక్రమ సంబంధాల వార్తలకు మంచి మైలేజీ వస్తోంది.. ఏ ఛానల్ కైనా
TRP ముఖ్యం. అది ఉంటేనే యాడ్స్ వస్తాయి. నాకు తెలిసి ప్రజాసేవకోసం ఎవరూ ఛానల్ పెట్టలేదు,
అది పక్కా వ్యాపారం. మరి వ్యాపారి అమ్ముడుపోయే సరుకు గురించే ఆలోచిస్తాడుగా... సో...చెప్పొచ్చేదేమంటే
ఓహ్... అని బట్టలు చింపుకోవద్దు, కొనేవాళ్ళు ఉన్నంతకాలం ఇక్కడ డిమాండ్ ఉన్న సరుకునే
అమ్ముతారు అంతే...
No comments:
Post a Comment