అందమైన స్వప్నం
మౌనముద్రను దాల్చిన
వెండి కడలి పొంగులా అవి...
లేక
పసిడి వర్ణం అద్దుకున్న
సుందర జలాశయమా అది...
అదిగో రాలిపడుతున్న తారకల
శిథిలాలు వెండి ముత్యాలై మెరుస్తున్నాయి...
పాలనురగ మెత్తని దూది పింజమై
గొడుగు పడుతోంది చూడు
ఎంత మనోహర దృశ్యమిది...
భార రహితమైన నేను
మెరుపులు చిందే చంద్రవంక
నావలో
ఎందుకున్నాను...
నా పయనానికి ఇది శ్రీకారమా
లేక చివరి మజిలీకి సంకేతమా...
ఏమో ఏదో లోకం వైపు
నాకు తెలియకనే జారిపోతున్నానేమో...
చందమామ కథలు
మదిని ఎక్కించుకున్న పర్యవసానమా
ఇది
లేక
భావుకత హద్దులు దాటిన
చిత్రవిచిత్ర వైనమా...
స్వప్నలోక విహారిని కదా
ఉందో లేదో తెలియని గమ్యంవైపు
సాగిపోతూనే ఉన్నాను...
ఉన్నదా ప్రభూ నీ దివ్యలోకం
చెదిరిపోతుందా
నా అందమైన స్వప్నం...
No comments:
Post a Comment