Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 17 July 2022

పిచ్చివాడినైతే ఎంతబాగుండేది

 

పిచ్చివాడినైతే ఎంతబాగుండేది

కన్నుల నుంచి జారి పడిన స్వప్నాలను ఏరుకోలేను...

కనురెప్పల లోగిలిలో

మరో స్వప్నం నాటుకోలేను...

మోడుబారిన మనోవనంలో మరో అంకురం కోసం ఆరాటపడలేను...

ముళ్లబాట నాదారిలో

పూరెమ్మలు జల్లుకోలేను...

చీకటి పయనంలో

చిరుదీపమై వెలగలేను...

ఎగసిపడే హృదయానికి మత్తుమందు ఇవ్వలేను...

ఎంతబాగుండేది

నేను గతాన్ని పూర్తిగా మరిచిపోతే...

మాయామనుషుల లోకంలో అన్నీ మరిచి

పిచ్చివాడిగా మిగిలిపోతే ఎంత బాగుండేది...

Sunday, 10 July 2022

ప్రపంచమా ఉలిక్కిపడు

 

ప్రపంచమా ఉలిక్కిపడు

తిరుగుబాటు ఒక స్వప్నమనీ

ప్రజాగ్రహం ఇక రానే రాదనీ

విప్లవం పుస్తకాలకే పరిమితమనీ

వ్యక్తిపూజ శిరోధార్యమని

మత్తులోపడి మునిగిపోయిన యువతరమా ఉలిక్కిపడు

లంకేయుల సమరనాదం ప్రపంచాన్ని వణికిస్తోంది

కడుపు మండితే

జెండాలు ఎజెండాలు లేకున్నా తిరుగుబాటు తప్పదని పిడికిలి బిగిస్తోంది

ఏ నాయకుడు లేకున్నా తనే నాయకుడై నిలుస్తోంది

ఏ జెండా ఎగురకున్నా

లంకేషుడి జెండా తలదించుకున్నది

లంకేయుల స్పూర్తి

జగతికి దీపమై వెలుగుతోంది...

నిశిని జయించిన శశిని

నిశిని జయించిన శశిని

నన్ను నేను ప్రేమించినంత కాలం...

నాకు నేను నచ్చినంత కాలం...

నా నడత మీద నాకు నమ్మకం ఉన్నంత కాలం...

నా ప్రశాంతతను భగ్నం చేసే దమ్ము ఎవరికీ...

సదా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటా

నిశిని జయించే శశిలా...


Tuesday, 5 July 2022

సమయాన్ని దోచుకుంటా

 

సమయాన్ని దోచుకుంటా



ఓ సమయమా

నువ్వెంత వేగంగా పయనించినా

ఎన్ని ఎత్తు పల్లాలు రుచి చూపినా

జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పినా

ఎన్ని ముళ్ళు గుండెలో గుచ్చినా

నీనుంచి అప్పుడప్పుడూ

మధురక్షణాలు దోచుకుంటూనే ఉంటా

నీ గాంభీర్యానికి చిరునవ్వులు అద్దుతూనే ఉంటా

నీ వేగానికి కళ్లెం వేస్తూనే ఉంటా

ఎందుకంటే నేను ఆనందాల దొంగను

నిన్ను కొల్లగొడుతూనే ఉంటా...