నాకు నువ్వంటే ఎందుకిష్టం...
నేనంటే నీకుఎందుకింత ఇష్టమని..
ఎన్నోసార్లు అడిగావు..
ప్రశ్నించావు...
వేధించావు....
పోరుపెట్టావు...
అవును...
నువ్వంటే నాకెందుకు ఇష్టం...
నీ ప్రశ్న
సుడులను రేపింది...
ఆ ఆలోచనలే..
నా జీవన గతులను స్థితులను..
మరోమారు తట్టి లేపాయి..
యవ్వనం చివుర్లు
విచ్చ్చుకున్న వేళ..
అప్పుడప్పుడే..
భావనలు
నిద్ర లేచి సోద పెడుతున్న ఘడియలు..
మెరుపులు చిందే ముద్దుగుమ్మలను
చూసాను....
ఓంపుసొంపులతో...
కవ్వించిన
మేని విరుపులను చూసాను..
ఔరా అనిపించిన సొగసుగత్తెలను
చూసాను...
కానీ...
ఆ అంద చందాలలు..
ఆ తీయని పలుకులు...
నా మనో ఫలకంపై ముద్రను వేయలేకపోయాయి..
కాలం గడిచింది..
పరిస్థితులు మారాయి..
నాపై బాధ్యతలు పెరిగాయి..
నా వల్ల కాదంటూ
వయసు దూరం పారిపోతున్నా..
మనోఫలకంపై..
చెరగని ముద్ర వేసిన
నా ఊహాసుందరి మాత్రం..
కనిపించలేదు..
జీవనసంధ్యా సమయం....
చేరువయ్యిందా అన్న భ్రాంతి
మదిని వేధిస్తున్న వేళ..
నింగి నుండి
నేలకు దిగిన
నెలవంకలా..
నువ్వు అడుపెట్టావ్
నా జీవితంలో ....
ఒక్క క్షణం..
సంభ్రమాశ్చర్యాలు...
కలయా నిజమా
అనే భావనా తరంగాలనుంచి...
తేరుకునే లోపలే ...
నా మనోఫలకంలో నీ రూపం
శాశ్వతంగా నిలిచిపోయింది..
అప్పుడు నాకు తెలిసింది..
ఎన్నాళ్ళుగానో
వేచిన ఉదయం...
ఇప్పుడు వికసించిందని....
ఇంకా అర్థం కాలేదా..
నాటి ఊహా సుందరే...
నేటి నా..
మనస్విని..
No comments:
Post a Comment