Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday, 30 June 2017

చుక్కల వీధిలో

చుక్కల వీధిలో
 
నిండు పున్నమి వెన్నెలలో
స్నానమాడుతున్న తామర కన్యను
కనులనిండా నింపుకుని
పచ్చదనాల కాన్వాసులో
పాలపొంగులా హోరు పెడుతున్న
జలపాత ఘీంకారాన్ని
గుండెనిండా పొదివి పట్టుకుని
నీలినింగి పై కదిలే చిత్రంలా హొయలుపోతున్న  
పక్షుల కువకువలను మనసులో దాచుకుని
కౌమారానికి చేరిన జవ్వని
పూబాల పుప్పొడిని దేహానికి అలుముకుని
గిలిగింతలు రేపుతున్న ప్రకృతి కాంత ఒడిలో
పసిపాపలా సేద తీరుతూ
మదిలో భావలకు అక్షర రూపం అందిస్తూ
విరంచినై నీ అనుభూతులను విరచిస్తూ
చుక్కల వీధిలో ఎగిరిపోతూ
అందమైన జ్ఞాపకంలా తళుకులీనాలని వుంది
మనస్వినీ


Sunday, 25 June 2017

పెళ్లిరోజు

పెళ్లిరోజు

 నువ్వూ నేనూ కలిసి అడుగులు వేసిన
మధురమైన రోజిది
నీతో తొలి అడుగులు నడిచిన
అమృత ఘడియలివి
నీతో నా ప్రయాణం రోజూ ఒక కొత్త అనుభవమే
కలిసి సాగుతున్న ఈ కాలంలో
పున్నమి వెన్నెలలు ఉన్నాయి
అమావాస్య రాత్రులూ ఉన్నాయి
కటిక చీకటిలో ఆగిపోలేదు మన పయనం
వెన్నెల వెలుగులను మనసు నిండా దాచుకుని
సాగింది గమనం
ముభావమైన నువ్వు ముడుచుకుపోయినా
మరు నిమిషమే పులకింతలు రేపావు
అడుగు జారితే చేయూతను ఇచ్చావు
ఆ దేవుడిని నేనెప్పుడూ
వరాలు అడగలేదు
ఊహా సుందరి నిజమై వస్తుందనీ అనుకోలేదు
ఊహించని వరమై నాలోకి వచ్చావు
జీవనసంధ్యలో వెన్నెలవై నిలిచావు
నువ్వు నాలోకి
నేను నీలోకి చేరిన పరిణయ దినోత్సవాన
కానుకలు ఏమివ్వగలను
భావాలను ఏ రీతిన తెలుపగలను
మనసును నీ పాదాలకు సమర్పించి
పెళ్లిరోజు శుభాకాంక్షలు మాత్రమేచెప్పగలను
మనస్వినీ

Friday, 23 June 2017

చిరునవ్వుతో సాగిపోవాలనీ...

చిరునవ్వుతో సాగిపోవాలనీ...

మనసు నిండా నవ్వాలని లేదు
గుండె పగిలేలా రోదించాలని లేదు

వెలుగు జిలుగులు చూడాలని లేదు  
కటికచీకటిలో సేదతీరాలని లేదు  

శిఖర శిథిలాలను ఏరుకోవాలని లేదు  
మరో వైభవ నిర్మాణం చేయాలని లేదు

విజయతీరాలను అందుకోవాలని లేదు  
పరాజయ కషాయాన్ని సేవించాలని లేదు  

అపవాదులతో ఎవరినీ అలంకరించాలని లేదు  
ముళ్ళ కిరీటాన్ని ధరించాలని లేదు

అవును
మనసు నిండా నవ్వాలని లేదు  
చిన్న చిరునవ్వుతో సాగిపోవాలని ఉంది
మనస్వినీ  

Monday, 19 June 2017

అద్దం

అద్దం 

నిలువుటద్దం ఎందుకు నీకు
నిలువెత్తు మనిషిని నేనున్నా చూడు
అద్దం లో నిన్ను నువ్వు చూసుకుంటావెందుకు
అద్దం లాంటి నా మనసులోకి తొంగి చూడు
మరుమల్లెల సింగారంతో మురిసిపోతావెందుకు
నా శ్వాసలో నీ ఊపిరిని రంగరించి చూడు
నన్ను నాలాగే అనుకుంటున్నావెందుకు
నీ ఊహల తలపులతో నీలాగే మారిపోయాచూడు
మనసు విప్పి మనసుతో చూడవెందుకు
నాలో నిన్నే చూసుకుంటావు చూడు
మనస్వినీ

Sunday, 11 June 2017

మరుజన్మంటూ నాకుంటే

మరుజన్మంటూ నాకుంటే

 చల్లని చిరుగాలి వింజామరలై
తనువును తాకుతూ మైమరిపిస్తూఉంటే
తరులనూ విరులనూ వీడి వాయువమ్మ
నన్నే పలకరిస్తూఉంటే
కనులముందు సోయగాలు చిందిస్తున్న
పూబాలపై తేనీయను తాగుతున్న
అందమైన సీతాకొకచిలుకను చూస్తున్నా నేను ...
చిరుగాలి తాకిడికి ప్రకంపిస్తున్న
నవరంగుల రెక్కల రంగులనుంచి
అక్షరాలను ఏరుకుంటున్నా నేను...
విచ్చుకున్న సీతాకొక చిలుక రెక్కల్లో
మకరంద పిపాసి తుమ్మెద సవ్వడిలో
నింగి కాన్వాసుపై కదిలే బొమ్మల పక్షులలో
నవ్వుతున్న పువ్వులలో
పులకిస్తున్న ప్రకృతిలో
పలకరిస్తున్న నా భావాలను
అక్షరాలుగా దిద్దుకుంటున్నా నేను...
చేతిలో నా మనసు కాగితం
భావమనే కలంతో అక్షరాలు రాసుకుంటున్నా నేను...
అలలా వీచిన కొంటెగాలి తాకిడి
నా కలల కాగితం జారిపోయింది
నా జీవితమే ఎగిరిపోయిందనే కలవరంతో
ఆ కాగితం వెంట పరుగులు తీస్తున్నా నేను...
మనసు పుటలను ఒడిసిపట్టుకున్నా
మనసును రంగరించి కొత్త అక్షరాలు రాసుకుంటున్నా...
అదే నేను
అవే భావాలు
ఒంటరినే అయిన నేను
ఎప్పటికీ ఒంటరిని కాను
భావాల రూపంలో
నా కవితల అల్లికలో
అందమైన ఊహల సవ్వడిలో
నా మనసులో దోబూచులాడుతూనే ఉన్నావు నువ్వు...
మరుజన్మంటూ ఉంటే
నేనూ నా భావాలు
నా ఊహలు
ఇంకేమీ వద్దు
అందమైన ఊహల ఉద్యానవనంలో
నీ భావాలతో బతికేస్తా
మనస్వినీ...