చిరునవ్వుతో సాగిపోవాలనీ...
మనసు నిండా నవ్వాలని
లేదు
గుండె పగిలేలా
రోదించాలని లేదు
వెలుగు జిలుగులు
చూడాలని లేదు
కటికచీకటిలో సేదతీరాలని
లేదు
శిఖర శిథిలాలను
ఏరుకోవాలని లేదు
మరో వైభవ నిర్మాణం
చేయాలని లేదు
విజయతీరాలను
అందుకోవాలని లేదు
పరాజయ కషాయాన్ని
సేవించాలని లేదు
అపవాదులతో ఎవరినీ
అలంకరించాలని లేదు
ముళ్ళ కిరీటాన్ని
ధరించాలని లేదు
అవును
మనసు నిండా నవ్వాలని
లేదు
చిన్న చిరునవ్వుతో
సాగిపోవాలని ఉంది
మనస్వినీ
No comments:
Post a Comment