రాతిపూల తేనియ
మతము లేనిది
కులం వాసన పడనిది
ఆస్తులు తెలియనిది
అంతస్తుల అంతరాలు
పట్టించుకోనిది
మనసు తప్ప మార్గమే
లేనిది
మమతలు తప్ప లక్ష్యమే
లేనిది
ముళ్ళ బాటలోనూ
పూలవాసన చూసేది
రాతిపూలలోనూ
తేనియను ఆస్వాదించేది
ఒయాసిస్సులోనూ
దప్పిక తీర్చేది
అగ్ని శిఖలు
కురుస్తున్నా
మంచువానలా పులకించేది
సుడిగుండాలు
చెలరేగుతున్నా
అలలనే నావగా
మలుచుకునేది
ఆగుతున్న ఊపిరిలో
శ్వాసను నింపేది
మృత్యు ఘంటికలను
కాలి అందియలుగా
ధరించేది
నీకు నేనున్నా
నాకు నువ్వుంటే చాలని
ముందుకు నడిపేది
అదే ప్రేమ
సమరంలోనూ వికసించే
ప్రేమ
మరణంలోనూ విరాజిల్లే
ప్రేమ
వసంతమే ఎదురైతే
కొత్తపుంతలు తొక్కదా
మనస్వినీ
No comments:
Post a Comment