అది నీవే
కంటి కిరణం మందగమనమై
దృశ్యం అదృశ్యమై
భావం నిర్లిప్తమై
స్వప్నం కరిగిపోతున్న
వేళ
అడుగులు భారమై
బాటలు మాయమై
పయనం ఆగిన వేళ
అలల సుడులను దాటినా
సునామీలను అధిగమించినా
అక్కున చేరుతున్న నావను
తీరమే విసిరికోట్టిన
వేళ
మనసు మూగబోయింది
భావం కరిగిపోయింది
ఆలోచన ఆవిరైపోయింది
కనులలో గంగ జలజలా జారిపోయింది
మనసులో వేదన ఉబికి
వచ్చింది
మనసంతా నిశి అలుముకుని
ఏం చేయాలో
ఎలా ముందుకు సాగాలో
అడుగులను ఎటు వేయాలో
నావను ఎలా దరి
చేర్చాలో
అర్థమే కాని అయోమయం
ముభావమైన భావంలో
అర్థం లేని ఆలోచనలో
గమ్యం లేని బాటలో
చిన్న స్వాంతన కోరింది
మనసు
పదే పదే కలవరించింది
మనసు
మనసు కలవరింతలో
చిరు పలకరింతలో
లీలగా కదిలే రూపం
చల్లని స్వాంతన ఇచ్చే
భావం
భరోసా ఇచ్చే మానసం
గమ్యం నేర్పే మార్గం
అన్నీ కలగలిపి
సంతరించుకునే రూపం
అది నీవే
మనస్వినీ
No comments:
Post a Comment