నా భావం ఒక అక్షరం కాదు
మౌనమై నీవున్నప్పుడు
ముభావమే నీ
భావమైనప్పుడు
సవ్వడి లేని వేళలో
చిరు సవ్వడినై
నీకురులను సుతారంగా
మీటే చిరుగాలిలో
తీయని అనుభూతినై
నేను వస్తా
ఒక చిరు కవితనై
నిన్ను పలకరిస్తా
నీ పెదాలు మౌనంగానే
విచ్చుకున్నా
నీ మనసు నన్ను
వికసించి పలకరిస్తుంది
నిశిని చీల్చే చల్లని
వెన్నెలలో
కమ్మదనమై నిన్ను
అల్లుకుంటా
ప్రభాత కిరణాల
నులివెచ్చని పలకరింతలో
శుభోదయమంటూ
నుదుటిన ముద్దాడుతా
ఏకాంతం నిన్ను
చుట్టుముట్టినా
మెహఫిల్ లో నీవు
కేంద్రమే అయినా
అందరిలో నేనే
కనిపిస్తా
వీచే గాలిలో
కురిసే వెన్నెలలో
మెరిసే ఎండలో
నీ మదిలో నేనే ఉంటా
నీ చిరునవ్వులో
ముత్యమై రాలిపడేది
నా భావమే
నీ కంటి కొలనులో
జారిపడే స్వాతిముత్యం
నా అక్షరమే
ఎలా మరువగలవు
నా పదాల అల్లికలను
నా భావాల గీతికలను
నీకు నేను
అంకితమిచ్చుకున్న
నా శ్వాసలో
జనియించిన భావాలు
నిత్యం నీతోనే ఉంటాయి
ఎందుకంటే
నా భావ సంకలనం
అక్షరాల సమూహం కాదు
అది నీకై నేను
అల్లుకున్న
జీవన సమాహారం
మనస్వినీ
No comments:
Post a Comment