అంతిమకోరిక
పాలమీగడ తివాచీ
పరుచుకున్న
మంచు కొండలపై
ఉదయభానుడు తన
కొంటె కిరణాలను
విసిరేస్తే
వెండిరంగులను
పులుముకున్న
హిమశిఖరాలు
ఎంత సుందరదృశ్యకావ్యం
ఆ అనుభవం...
అప్పుడే తాకిన
ఉదయకిరణాలు
ఎర్రగులాబీలను
ముద్దాడుతూ ఉంటే
అటుగా వచ్చిన ఓ
మబ్బుతునక
పూదోటను కమ్మేసుకుంటే
కలయా నిజామా అనిపించే
అనుభూతి
ఎంత వింత సోయగమో...
ఒక్కసారి కిందకు
చూస్తే
ఎక్కడో లోయల అంచులలో
మెల్లగా కదులుతున్న
దూదిపింజాల్లా
మేఘమాలికలు
ఏవేవో కథలు
చెబుతూవుంటే
స్వర్గం దివిని వీడి
భువికి చేరిందా
మనసులో ఏవేవో ప్రశ్నలు...
మంచు ముద్దల్లో పాదాలు
కూరుకుపోతూవున్నా
ఉల్లాసంగా ఉత్సాహంగా
ముందుకు సాగుతూ
మంచు బంతులతో కేరింతలు
కొట్టే మనసు
ఆ మనసులో ఎన్నెన్ని
భావాలో...
సుందర హిమాలయ సోయగం
అదో వింతైన అనుభవం
అది నాకు కొత్త
కాకున్నా
అనుభవం నాకు ఎంతో
వున్నా
ఆ మధురానుభూతులు
నీతో పంచుకోవాలనీ
నీతో కలిసి
హిమవన్నగాల నీడలో
సేదతీరాలనీ
జన్మ ముగిసే ఘడియలోగా
ఒక్కసారైనా
ఆ మంచుకొండల్లో
విహరించాలనీ
సుందర హిమాలయాలతో
పోటీపడే
నీ పరువాలతో
మంచువానలో పునీతం
కావాలనీ
నా మనసు
అంతిమకోరిక...
మనసు తోటలో మొలకెత్తిన
కోరికలన్నీ
తీరాలని లేదుకదా
మనస్వినీ...
No comments:
Post a Comment