దప్పికున్న మేఘం
దప్పికున్న మేఘం కడలి
వైపు ఒరిగింది
దాహార్తి తీర్చమని
కెరటాలను తడిమింది...
సొగసైన కెరటాల
వలవిసిరిన సాగరిక
మేఘం వైపు చేతులు
చాచింది...
పులకించిన కడలి కెరటాల
ఆవిరిలో
మేఘం కొత్త ఊపిర్లు
పోసుకుంది...
గుండెనిండా ప్రేమ
నింపుకున్న మేఘం
అమృత వర్షం
కురిపించింది...
తడియారిన దేహంతో దూది
పింజమై
విలపించిన మేఘం
తనువును తాకిన వలపు
చినుకులతో
కొదమసింహమై చెలరేగింది...
ఒంటిని తాకిన అమృత
చినుకులతో
కడలి పరువాల వీణలా
మోగింది...
దాహమై నర్తించిన మేఘం
చినుకులా మారి కడలిలో
కలిసిపోయింది...
మేఘానికి తెలుసు తన
వలపు పోరాటం
ఒక మరణమని...
తీరని దాహం కోసం
దప్పిగొన్న మేఘం
ఎన్నిసార్లయినా
మరణిస్తుంది
మనస్వినీ...
No comments:
Post a Comment