ధన్యవాదాలు మహర్షీ
నిశబ్దం నీకూ నాకూ మధ్య
ఇది ఎప్పుడూ ఉండేదే
నిన్ను కలిసిన ప్రతిసారీ
నేను మౌనంగానే మాట్లాడాను
మౌనంగానే ప్రశ్నించాను
మౌనంగానే వేడుకున్నాను
మౌనంగానే ఏడిచాను
కనులజారే నీటిని అదిమి పెట్టుకుంటూ...
మౌనంగానే నీ సహాయంకోరాను
వికలమైన మనసును ఒదార్చుకుంటూ...
నా మౌనవేదనకు నువ్వు
మౌనంగానే బదులిస్తున్నావని అనుకున్నా
నా వెనుక నువ్వున్నావని మనసు నిండా
నమ్ముతూ...
నీకన్నీ తెలుసని అనుకుంటూనే
నీకన్నీ చెప్పుకున్నా
అండగా నిలుస్తావని అనుకుంటూ...
మౌనంగానే ఉండిపోయిన నువ్వు
మౌనంతోనే ముందుకు నడిపావు
నాలో ఒక అంతర్లీన శక్తిగా నడుస్తూ...
ఇప్పుడూ మౌనంగానే నివేదిస్తున్నా
మౌనంగానే తలవంచి ఉన్నా
నువ్వే అన్నీ అని ఇంకా నమ్ముతూ...
చాలా జరిగాయి జీవితంలో
ఎన్నెన్నో వేదనలు
అంతకు మించిన మధురిమలు
వందలాది పరాజయాలు
అప్పుడప్పుడూ పలకరించిన విజయాలు
మనం మౌనంలోనే
పరిమళాలు వికసించాయని తెలుసు...
మనసుకు ఒదార్పునిచ్చిన నీకు
బతుకుబాటలో తోడు నిలిచిన నీకు
మౌనంగానే ప్రణమిల్లుతున్నా...
మహర్షీ !
ఇంక సెలవు
మరలా నిన్ను ఏదీ కోరను
నాకు నేనుగా ఏదీ అడగను
మౌనమనే ప్రార్థనలో నేను పొందిన
అనుభూతులు
చిన్న చిన్న విజయాలు
ఇదే జీవితం కాదని తెలిసిన నేను
నిన్నెలా నిందించగలను...
ఆశీస్సులు అందించే నువ్వు
విధిరాతను మార్చలేవని తెలుసుకున్నా
అందుకే ఇక ఎవరినీ ఏదీ అడగను
మౌనంగానే సెలవ్ తీసుకుంటున్నా...
ఏమో వస్తానేమో మరలా నీ చెంతకు
తలవంచుతానేమో నీ దిశకు
మౌనంగానే పలకరించి
మౌనంగానే మరలి వెళతా
నిన్ను మాత్రం ఏదీ కోరను
మహాత్మా
ధన్యవాదములు
డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు
ReplyDeletehttps://goo.gl/r6qXB9