చీకటి పక్షి
ఎక్కడుంది గమ్యం
ఎందుకు తడబడింది పయనం
శశిని చూస్తూ నిశిన జారిందా
నిశి రక్కసి శశిని మింగిందా
అంతులేని గజిబిజి పయనం
వెలుగుతాకని మానసం...
చీకటి పక్షుల కువకువలు
నల్లని మనసుల గుసగుసలు
అంతులేని వికృత క్రీడలు
అలుపే లేని ఆరాటాలు
ఎందాక సాగేనీ పయనం...
వీడలేమని వెంటాడే నిన్నటి మరకలు
రోజూ వికసించే చీకటి పుష్పాలు
చీకటి మరకలను వీడేనా పుష్పం
మరలా వికసించేనా హృదయం...
కలకలం రేపేను పరుల భాష్యం
మనసున రగిలెను అగ్ని గుండం
చేష్టలుడుగిన మానసం
దిక్కుతోచని అయోమయం...
ఆగదేమో ఈ పయనం
చీకటినుంచి మరో చీకటి ఆహ్వానం
కొన్ని జీవితాలింతే
మరణమనే చీకటిలోనే
సత్యాక్షరాలు లిఖిస్తాయి
మనస్వినీ...
No comments:
Post a Comment