Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 28 August 2016

ఎవరికెలా అనిపిస్తే అలా...

ఎవరికెలా అనిపిస్తే అలా...

ఒక మనసు ఒకలా
మరో మనసు మరొకలా
ఎవరికి తోచిన భాష్యం వారిది...
నా అక్షరాలు అందరికీ ఒకేలా అనిపించవు
ఒక్కో మనసును ఒక్కోలా
పలకరిస్తున్నాయి నా భావాలు...
ఒకరికి ఆనందం కలిగిస్తే
ఒకరికి విషాదం చూపుతున్నాయి
ఒకరికి ఆగ్రహం కలిగిస్తే
మరొకరికి నవ్వు తెప్పిస్తున్నాయి...
చాలా సూటిగా రాస్తున్నావని ఒకరు
హృద్యమైన భావమని మరొకరు
తిరుగుబాటుకు సంకేతమని ఇంకొకరు
ఎవరికి ఎలా అర్థమైతే అలా...
జీవితాన్ని ఆహ్లాదంగా అనుభవిస్తున్నావని ఒకరంటారు
ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు రాస్తారేమని
మరొకరంటారు
భలే చెప్పావన్నా అని ఒక ప్రోత్సాహం...
నా అక్షరంలో నాకు ఇవేమీ కనిపించవు
అభిప్రాయాలను నేను రాయను
ప్రభావిత పూలను పూయించను
మతలబు సుగంధాలు అక్షరాలకు పూయను
లక్ష్యాలను నిర్మించి అక్షర వంతెనలను కట్టను
ప్రేమను రంగరించను
ఆవేశాలను విరజిమ్మను
ఆవేదనలు నటియించను...
గుండె చప్పుళ్ళకు నిజాయితీని జోడించి
అక్షర కుసుమాలను సాగు చేస్తూనే ఉంటా
ఎవరికి నచ్చినా నచ్చకున్నా
మనస్వినీ...

Saturday, 27 August 2016

మరణమంటే భయమెందుకు...

మరణమంటే భయమెందుకు...
రెప్పపాటులో కరిగిపోయేది
ఒకసారి జారితే మరలా తిరిగిరానిది
ఎంత అమూల్యమో
అంతే విలువలేనిదీ జీవితం...
అక్కరకు రాని ఆరాటం ఎందుకు
పనికిమాలిన పోరాటం ఎందుకు...
నిజమెందుకు వద్యశిలపై తలవాల్చింది
నమ్మకం ఎందుకు ఉరికొయ్యకు వేలాడుతోంది
అనుమానాలు అవమానాలు
పిశాచ గణాలై ఎందుకు ఉసురు తీస్తున్నాయి...
ఆవేశమెందుకు వెర్రితలలు వేస్తోంది
అనురాగమెందుకు మంచులా కరుగుతున్నది
జీవితమెందుకు నరకంలా మారుతున్నది...
అనుభూతులు ఎందుకు
అనుభవాలుగానే మిగిలిపోతున్నాయి
అనుభవాలు ఎందుకు మంటలు రేపుతున్నాయి  
అనుభూతిని పంచని అనుభవమెందుకు...
తలరాతలు రాసే అధికారం మనుషులకు ఎందుకు
మనిషే మనిషిని శాసిస్తే దేవుడు ఎందుకు
నాస్తిగా దేవుడే మారితే ఆస్తికులు ఎందుకు...
మనసు పంచి ఇవ్వని మనుషులకు మమతలు ఎందుకు
మమతే మాయమైతే సిరి సంపదలు ఎందుకు
కనులు మూస్తే రాలిపోయే జీవితానికి
కోట్ల ఆస్తులు ఎందుకు...
వ్యక్తిత్వాన్ని పరులే నిర్దేశిస్తారు ఎందుకు
పరపలుకులే తూటాలుగా మారడం ఎందుకు
మనసే మనసును నిందిస్తే ఈ జీవితం ఎందుకు...
అబద్దమనే సాలెగూడులో
నిజానికి మరణం తప్పదని తెలిసినా
ఇంకా పనికిరాని మౌనమెందుకు
అందుకే జీవితంపై తిరుగుబాటు చేస్తున్నా
నాకింకా మరణమంటే భయమెందుకు
మనస్వినీ...

Friday, 26 August 2016

అన్నా వేమన్నా

అన్నా వేమన్నా

తినగ తినగ వేము తియ్యగ నుండు
వేమన్నా ఏమన్నా
నీకెలా తోచిందన్నా
అప్పట్లో నువ్వు చెప్పిన ఈ మాట
ఇప్పటికీ వరాల మూటగా నిలిచిందన్నా
తినగ తినగ వేము అన్నావ్
అనగ అనగ రాగమన్నావ్
జీవిత సత్యాన్ని ఎంతబాగా చెప్పావన్నా
ఒకటే మాట
ఒకటే ఆరోపణ
నిత్యం నా చెవుల మారు మ్రోగుతుంటే
అది నిజమై నా మనసులో ముద్ర వేసిందన్నా
అందుకే నేనిదే
నేనిలాగే చూస్తా
నా పద్దతి ఇంతే అని తెగేసి చెబుతున్నా
అల్పుల పలుకులు ప్రియములై
ప్రియమైన మనసు తూటాలు విసురుతూ ఉంటే
సహనం నశించి తిరుగుబాటు చేస్తున్నా
నిండా మునిగిన మనసుకు ఇంకా చలేమిటన్నా
చావో రేవో అంటూ మనసు తిరుగుబాటు చేస్తోందన్నా
అన్నా వేమన్నా
నీ వాక్కులు నేటికీ అక్షరసత్యాలన్నా

Thursday, 25 August 2016

విరిగిన మనసుల సమ్మేళనం సమయం

విరిగిన మనసుల సమ్మేళనం సమయం

సమయానికే రూపం ఉంటే
దానికీ ఒక మనసు ఉంటే
అది ఖచ్చితంగా రాతి హృదయమే
వికృత వినాశ సదృశ్యమే...
సమయం ఒక పైశాచిక సంకేతమే
విరిగిన మనసుల సమ్మేళనమే...
నిజమే
ఎంత క్రూరమైనదీ సమయం
ఆనందాలను నిలువనీయదు
విషాదాలను కరగనీయదు...
కాలం కలిసివస్తే ఏదీ దాగదు
ఏదీ ఆగదని అంటారు
కాలం ఎవరికి కలిసి వస్తుందో
ఎవరికీ తెలియదు...
పులకింతలను క్షణ కాలంలో మసి చేస్తుంది
ఆనందాలను గతంలా మార్చి మాయం చేస్తుంది
గుండె బరువే అయితే
నత్తనడకతో పరీక్షలు పెడుతుంది...
మంచి సమయం మించిన దొరకదని అంటారు
సమయం జారితే తిరిగి రానే రాదనీ అంటారు
మంచి సమయం దొరికింది ఎందరికి
గులాబీలా అది పరిమళించింది కొందరికి
సమయానికి నిజంగా ఎంత పక్షపాతం...
విరిగిన మనసుల కేళిలో
గడియారం శాసనాలను
సమయం ఎప్పుడో మరిచిపోయింది
మనస్వినీ...

Wednesday, 24 August 2016

మౌనంగానే శబ్ధం చేసిన శూన్యం

మౌనంగానే శబ్ధం చేసిన శూన్యం

ఎంత మధురం ఈ మౌనం
ఎంత ఉపశమనం ఈ మౌనం
ఎంత అద్భుతం ఈ నిశబ్ధం
ఎంత ఓదార్పు ఈ నిశబ్ధం
ఎంత అందమైన అనుభవం ఈ శూన్యం
ఎంత తీయని లేపనం ఈ శూన్యం
మౌనంలోనే నేను మధురానుభూతిని పొందుతాను
మౌనంలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటాను
ఈటెలను తలపించే మాటలుండవు
గుండెను తాకే తూటాలు ఉండవు
మౌనంలో నేను నాతోనే మాటాడుతూ ఉంటాను
నన్ను నేను ఓదార్చుకుంటాను
నిశబ్ధం అంటే నాకు చాలా ఇష్టం
నిశబ్ధంలోనే చిన్ని చిన్ని సవ్వడులతో
నా మనసు శబ్ధం పుట్టిస్తుంది
మనసుకు ఇంపైన ఒక శబ్ధం
మనసును మురిపించే మరో శబ్ధం
మనసుకు నచ్చేదే ప్రతి శబ్ధం
నిశబ్ధంలో నాకు నచ్చని శబ్ధమే లేదు
ఎక్కడో శూన్యంలో చూస్తూ కూర్చోను
ఆ శూన్యంలోనే రంగులు వేస్తూ ఉంటాను
జీవన గమనంలో ప్రతి దృశ్యాన్నీ
శూన్యంలోనే నెమరు వేసుకుంటాను
మౌనాన్ని అక్కున చేర్చుకుని
నిశబ్ధానికి గుండెను పరిచి
శూన్యంలో విహరించటం నాకెంతో ఇష్టం
మనస్వినీ

Monday, 22 August 2016

వెక్కిరించిన నిజం

వెక్కిరించిన నిజం
అంతర్లీనమై భయపెట్టిన నిజం
వికృత స్వరూపమై ఉబికి వచ్చింది...
మనసులోనే దాగిన కలవరం
కనులముందు కలకలం రేపింది...
ఒక వైఫల్యం వెక్కిరించింది
ఒక నిస్సహాయత వెకిలి నవ్వు నవ్వింది...
మనసులో మెదిలిన గతం
రాక్షసానందమై నర్తించింది...
కనుచూపుతో చక్రం తిప్పిన మనసు
చక్రబంధం లో బంధీలా
కన్నీటి పర్యంతమయ్యింది...
భయానికే భయం పుట్టిస్తానని
మీసం మెలేసిన మనసు
చిగురుటాకులా వణికిపోయింది...
 చిన్న కలవరమే
మనసులో పెద్ద కలకలమై
చేదు వాస్తవాలను కళ్ళకు కట్టింది
మనస్వినీ...


Sunday, 21 August 2016

భయానికే భయం...

భయానికే భయం...
శిఖరమై నిలిచిన సహనము
మంచు సౌధమై కూలుతున్నది...
మట్టి పెళ్లలుగా రాలిన వైభవము
ఆగ్రహమై రంకెలు వేస్తున్నది...
ఆశలుగా మొలిచిన స్వప్నాలు
తిరిగిరామని పరుగులు తీస్తున్నవి...
గుండె కనుమలో దాగిన శాంతము
అల్లకల్లోలమై రగులుతున్నది...
ముద్దుమురిపాలకై వేచిన మానసం
ఆశలపై నీళ్ళు చల్లుతున్నది...
నిప్పుపై నివురులా మనసును కప్పిన భయము
మొండి ధైర్యమై కాలుతున్నది...
సహనాన్ని మింగిన గ్రహణం
అసహనాన్నే విసర్జిస్తున్నది...
వెలుగు లేనే లేదని తెలిసిన మనసు
చీకటి లోయనే గమ్యమని నమ్ముతున్నది...
పరిణామాలకు ప్రణమిల్లిన మనసు
పరిణామక్రమానికి మూగ సాక్షిగానే నిలుస్తున్నది...
ఇక ఈ మనసు భయానికే భయం పుట్టిస్తుంది
మనస్వినీ...

నేనోడి నన్నే గెలిపించనా

నేనోడి నన్నే గెలిపించనా

నేను నేనేనా
నాలో నాకే తెలియని నేను
మరో రూపంలో నేనున్నానా
నన్ను నేను తెలుసుకోలేక
నాతోనే నేను సమరం చేస్తున్నానా
అసలు నేను ఎవరు
నాలో దాగి ఉన్న మరో నేను ఎవరు
నాతోనే నాకు వైరమెందుకు
నేనంటే నాకే భయం ఎందుకు
నాపై నాకే అసహ్యం ఎందుకు
నన్ను నేనే చంపేయాలని
ఉబలాటం ఎందుకు  
ఏమయ్యింది నాలో
మరో నేనుగా ఎందుకు చేరాను నాలో
నాకే కానరాని నేను
మరొకరికి ఎలా కనిపిస్తున్నాను నేను
నాకే తెలియకుండా
నేనే అడుగులు ఎలా వేస్తున్నానా  
నాకు తెలియని మజిలీలను
నేనే ఎలా వెతుక్కుంటున్నాను
ఏమో నిజంగా నేను నేనే కానేమో
నాలో ఉన్న మరో నేనే నిజమేమో
నాగురించి నాకే తెలియనప్పుడు
నన్ను బాగా చదివిన వారి మాటే వినాలేమో
నా ముందు నాకే ఓటమి తప్పదేమో
క్షణం కూడా పట్టదేమో
నన్ను నేనే ఓడించేందుకు
నేనోడి నన్నే గెలిపించినా
ఆ విజయమూ నాదే కదా  
మనస్వినీ...

Saturday, 20 August 2016

నిన్నే ప్రేమిస్తా...

నిన్నే ప్రేమిస్తా...
నిన్ను మరలా ప్రేమించాలని ఉంది
అవును
నిన్నే మళ్ళీ మళ్ళీ ప్రేమించాలని ఉంది...
వలపుల మేఘాలను తలపుల రథంలా మలిచి
ప్రణయ వినీలాకాశంలో
విహరించాలని ఉంది...
నల్లరంగు అగాధాలను పాల మీగడతో తుడిచేసి
సప్త వర్ణాలను స్పృశించాలని ఉంది...
తరలిపోతున్న వసంతాన్ని
గుండెకు పొదివి పట్టుకుని
మనసు నిండా ముద్దాడాలని ఉంది...
 పరుష పదాల గొంతు నొక్కి
తీయని పలుకుల మధురిమలను
మనసు పొరలపై అద్దుకోవాలని ఉంది...
భావరహిత అధరాలపై కమ్ముకున్న పరదాలు విసిరేసి
చిరునవ్వు తారకలను విరబూయాలని ఉంది...
రాలిపడుతున్న నవ్వుల ముత్యాలను దోసిటపట్టి
కనురెప్పలపై కొత్త స్వప్నాలుగా
నాటుకోవాలని ఉంది...
అవును నిన్ను మళ్ళీ మళ్ళీ
ప్రేమించాలని ఉంది...
చెదరిన మనసులకు
నమ్మకమనే లేపనం అద్ది
మనసు శిఖరాన్ని నింగికి నిలపాలని ఉంది...
నీ మనసుతో మొదలైన పయనాన్ని
నీ మనసుతోనే ముగించాలని ఉంది
మనస్వినీ...

Friday, 19 August 2016

స్వర్గం నరకం

స్వర్గం నరకం
అప్పుడప్పుడూ నా ఆలోచనలు స్వర్గం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. స్వర్గమంటే ఏమిటి... అసలు స్వర్గమెలా ఉంటుంది.. పురాణాలలో చెప్పిన విధంగా అక్కడ అంతా సుఖంగానే ఉంటుందా.. స్వర్గానికి చేరిన జీవికి ఇక కష్టమనేదే తెలియదా... హంసతూలికా తల్పములు, కోరుకున్న ఆహార పానీయములు, ఆటలు, పాటలు, విందులూ వినోదాలు.. నిజంగా స్వర్గం ఇలాగే ఉంటుందా... ఒక్కో మతంలో ఒకోలా చెప్పినా అన్ని మతాలూ స్వర్గం గురించి చెప్పింది ఒక్కటే... కనీ వినీ ఎరుగని సౌఖ్యాలు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో గడిపే అవకాశమే స్వర్గమని ఒక వాదన అయితే, రంభా ఊర్వశీ తిలోత్తమ వంటి సుందరాంగుల సహావాస నిలయమని మరొక వాదన. ఎవరి వాదన ఎలాగున్నా స్వర్గం మానసిక శారీరక సౌఖ్యానికి నిలయమన్నది ఫైనల్ వాదన..
ఇదంతా బాగానే ఉంది. స్వర్గం గురించి చర్చించాలని నాకు లేదు. ఆ స్వర్గానికి చేరే మార్గాలపైనే నాకు అభ్యంతరం... మనిషిగా పుట్టినవాడు ఎలాంటి పాపాలు, చిన్న చిన్న తప్పుడు పనులు కూడా చేయకుండా నిత్యం భగవన్నామస్మరణంలో ఉండి బతుకు బండి లాగించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతా దైవలీల అనుకుంటూ సర్దుకుపోవాలి.. తినడానికి తిండి లేకున్నా ఒంటి మీద సరియైన బట్ట లేకున్నా నవ్వుతూ భరించాలి.. తనకన్నా బలవంతుడు ఎన్ని రూపాలలో హింసపెట్టినా పాపిని దేవుడే చూసుకుంటాడులే అని మౌనంగా భరించాలి. కుట్రలు కుతంత్రాలు మాయలూ అన్నీ దేవుడే చూసుకుంటాడు అనుకుని మౌనంగానే నరకంలోకి జారుకోవాలి ఎలాగూ ఎదిరించే దమ్ము ఉండదు గనుక.... మన మతాలు చెప్పిన ప్రకారం ఇలాంటి మానవుడు ఖచ్చితంగా స్వర్గానికే చేరుకుంటాడు.
సరే స్వర్గానికి ఇదే మార్గమని నమ్ముదాం నమ్మక తప్పదు మరి... అయితే ఉన్నదో లేదో ఇప్పటిదాకా నిర్ధారణ కాని స్వర్గం కోసం జీవితంలో నరకం అనుభవించాలా... సినిమాల్లో చూపే నరకాన్ని మించిన దుర్భర జీవితాన్ని బతికి ఉండీ అనుభవించాలా... రేపు బిర్యానీ తింటామనే నమ్మకంతో ఈ రోజు పస్తులు ఉండాలా... తదనంతరపు సౌఖ్యాల భ్రమలో ఇప్పుడు నరకం అనుభవించాలా...
ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా స్వర్గం ఉందనీ, ఉంటే బాధితులు ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తారనీ.. ఏమో ఏదో ఒక క్లాజు అడ్డు వచ్చి నరకంలో విసిరేయరు అనే నమ్మకమేమిటి... మనిషిగా పుట్టి భూమి మీద నరకం అనుభవించి చచ్చాక ఉందో లేదో తెలియని స్వర్గం కోసం ఎందుకు వెంపర్లాడాలి.
నాకైతే స్వర్గం మీద నమ్మకం లేదు.. అలాగని భూమి మీది నరకాన్ని అధిగమించనూ లేను.. ఎందుకంటే సామాన్యుడిని గనుక. మరణం తర్వాత స్వర్గం నరకం విషయాలు పక్కన పెడితే భూమి మీదే స్వర్గాన్ని అనుభవిస్తున్న వాళ్ళూ ఉన్నారు.. వారిని చూస్తూ స్వర్గమంటే ఇలాగే ఉంటుంది కాబోలని సర్ది పెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం.

మతం మత్తులో మునిగినవారికి కోపం రావచ్చు. దైవ సన్నిధానికి చేరే మర్గాలనే ప్రశ్నిస్తావా అని ఫత్వా జారీ చేయొచ్చు.. కాని ఇది నా అభిప్రాయం ఎవరు మాత్రం ఎలా మార్చగలరు.

పుడమిని తాకని వాన చినుకు

పుడమిని తాకని వాన చినుకు
పున్నమి వెన్నెలలో నేలకు ఒరుగుతూ
కనిపించీ కనిపించని వెలుగులు చిమ్ముతూ
చీకటిలో కలిసిన నక్షత్ర ధూళిని నేను...
నా వెలుగులు చూసి వరాలు కోరుకున్నా
నన్ను నేను కోల్పోయి పుడమి పంచన చేరి
రాలిపడిన తారకనే నేను...
వెలుగులు నశించి చీకటిని గ్రహించి
వెలుతురే ఇవ్వని దీపాన్ని నేను...
మబ్బుల పానుపులను
ఆశల పల్లకీలుగా మలుచుకుని
కడలిపైనే వర్షించిన మేఘమును నేను...
అలలపై కురిసి కడలితో పులకించి
పుడమిని తాకని వాన చినుకును నేను...
ప్రశ్నకు సమాధానానికి మధ్య వ్యవధిలో
బడలికగా నడియాడే గడియారం ముల్లును నేను...
ప్రశ్న నుంచి సమాధానం వైపు పయనంలో
అలుపే ఎరుగని బాటసారిని నేను...
సమాధానమనే మజిలీలో
వెయ్యి సంకెళ్ళ ప్రశ్నలతో
బంధీనైన సమాధానమే నేను... 

Wednesday, 17 August 2016

గతం కాటు

గతం కాటు
జారిపోతున్న జీవితాన్ని ఒడిసి పట్టుకుని
పైకి ఎగబాకుతూనే ఉన్నా
ఎలాగైనా కాపాడుకోవాలనీ...
కరిగిపోతున్న స్వప్నాలను దోసిట పట్టి
పరుగులు తీస్తూనే ఉన్నా
కరిగిపోనీయరాదనీ...
గతాన్ని తిరస్కరించి
వర్తమానం తలుపులు తడుతున్నా
భవిష్యత్తును పదిలం చేసుకోవాలనీ...
జీవితం జారిపోతోంది
స్వప్నం కరిగిపోతోంది
గతం కాటు వేస్తోంది...
కలల వరదలో మునిగిన జీవితాన్ని దరికి చేర్చి
మరలా పరుగులు తీస్తున్నా
గతానికి చిక్కకుండా...