అంతిమయాత్ర
నిశీధి రాజ్యానికి అధినేతను
నేను
కుప్పకూలిన శిఖరంలో ఒంటరిగా
విలపిస్తున్న పునాదిరాయిని నేను
కూలిన సౌధంలో ఎగసిపడిన
మట్టిధూళిని నేను
ఉప్పెనలా కమ్ముకున్న నీటి
కెరటాలకు
కొట్టుకుపోయిన పూదోటను నేను
వాడిన వసంతంలో
రెక్కలు విరిగిన పువ్వునే నేను
కనులముందు స్వప్నాలు
కరిగిపోతుంటే
ఏమీ చేయలేక
ఘనీభవించిన కన్నీటి చుక్కను
నేను
అడుగుజాడలు వెతుక్కుంటూ
బురద మట్టిలో దిగబడిన
పాదమును నేను
కలల పుష్పాలు
ధూళిలో కొట్టుకుపోతుంటే
నిర్వేదంగా చూస్తూ నిలిచిన
మోడువారిన మానుని నేను
ఊహల నగరిలో విహరించి
ఎదురేలేదు నాకంటూ పొంగిపోయి
అయినవారందరినీ దూరం చేసుకున్న
అనాధనే నేను
నాదన్నది నాదే
అదే ధర్మమని హద్దులు దాటిన
భంగపాటును నేను
గుండె నిండా అనురాగాన్ని
మనసునిండా మమకారాన్ని
ప్రతిశ్వాసలో అనుబంధాన్ని
దాచుకున్నా
పిచ్చి పిచ్చి భావాలతో
ఎవరికీ అర్థంకాని అంతరంగంతో
మనసు భాష చెప్పలేని
వైఫల్యంతో
అంతిమయాత్రకు పయనమైన
బాటసారిని నేను
No comments:
Post a Comment