జీవితం వంచనాశిల్పం
ఊపిరి పోసుకున్న
ఆదిఘడియ నుంచి
నాతోనే ఉన్నావు
తప్పటడుగుల ఆరాటంలో
అడుగులజాడ అయ్యావు
ప్రతి గమనంలో నేనే
నువ్వూ అనిపించావు
ప్రతి పథంలో
మలుపులెన్నో చూపించావు
మలుపు మలుపులో
కన్నీటి ప్రవాహాలే
రుచి చూపించావు
అవధులు లేని ఆనందాలు
నేనడగలేదు
అంతులేని ధనరాశులు
నేను కోరుకోలేదు
కాసింత ఆనందం
ఒకింత ఉపశమనం ఆశించాను
నేను
అడిగినది అందించక
తెలియని కోణాలు
చూపించావు
కనులముందు మాయపొరలు
కట్టేసావు
మంచిని చెడుగా
చెడును మంచిగా భ్రమింపజేసావు
నేనంటే నువ్వే
నువ్వంటే నేనేగా
మరెందుకు ఇలా చేసావు
ఎందుకు వంచనా శిల్పంగా
నిలిచావు
నన్ను ఓడిస్తూ
నువ్వే గెలిచినట్టు విర్రవీగుతున్నావు
జీవితమా!
నువ్వే గొప్పా
నువ్వు చేసిందే ఒప్పా
అంతిమ విజయం నీదేనా
ఎందుకంత మిడిసిపాటు
నిన్ను ఓడించటం నాకు
రాదా
భంగపాటుకు బదులే లేదని
భ్రమా
జీవితమా!
తెలుసుకో
నాతోనే నీ ఉనికి
నా ఊపిరే నీకు ప్రాణవాయువు
ఒక్కసారి నేను
మృత్యుదేవత పంచన చేరితే
నువ్వెక్కడా
నీ ఉనికి ఎక్కడా
తెలుసుకో జీవితమా
నిన్ను ఓడించటం నాకు
క్షణకాలమే
ఘడియలు లెక్కించుకో
అంతిమ విజయం నాదే
No comments:
Post a Comment