ప్రశ్నిస్తున్న పువ్వులు
గాలీ వాన
దిక్కులు కానరాని జడివాన
నింగీ నేలను ఒకటి చేస్తున్న
హోరుగాలి
జీవన తంత్రంలో
కుట్రలు కుతంత్రాల చదరంగంలో
మాయాలోకపు పోకడలో
మనుగడకోసం
బ్రతుకు సమరంలో
ఓడిపోయిన మనసు
ప్రశాంతత కోసం
అంతిమ అడుగులు వేస్తుంటే
కాళ్ళకు ఏదో తగిలింది
ఏవో రెండు లతలు
పాదాలను పెనవేసుకున్నాయి
ఒక్కసారి చూసాను ఏమిటా అని
రెండు లతలకు రెండు పువ్వులు
వాన నీటికి తడిసి ముద్దయ్యాయి
హోరుగాలికి వణికిపోతున్నాయి
ఆర్తిగానూ
భయంగానూ
ఆవేదనగా నా వైపే చూస్తున్నాయి
దైన్యంగా
మేమేం పాపం చేశామన్నట్టుగా
అవును ఆ పసి పుష్పాలు ఏం చేసాయి
ఎందుకింత శిక్ష ఆ పసిమనసులకు
నేను చేసిన తప్పిదాలకేగా అవి బలయ్యాయి
నా జీవనవనంలో విరిసిన పుష్పాలవి
భ్రమల్లో విహరించిన నేను
ఆ పువ్వులను గాలికి వదిలేసాను
ఆ లేత పువ్వులు
ఎండకు ఎండాయి
వానకు తడిచాయి
నా ఆనందంలో
నా వేదనలో
నా ప్రతి గమనంలో
నా అడుగులలో
నా తప్పుటడుగులలో
నా వెంటే ఉంటూ నిత్యం
పరిమళించాయి
కన్నులున్నా కబోధిలా నేను
ఆ పువ్వులలో వాడుతున్న రెక్కలను
చూడలేదు
ఆ కడుపుల ఆకలి కేకలు వినలేదు
మనసంటూ ఒకసారి
సిద్దాంతాలంటూ మరోసారి
నా బాటలోనే సాగిపోయా తప్ప
పసి మొగ్గల ఆవేదన ఆలకించలేదు
కూలిన శిథిలాల కింద
ఆ పువ్వుల బతుకు కేకలు నాకు
వినిపించనే లేదు
తూఫాను ఎందుకు వచ్చిందో
వసంతం ఎందుకు వాడిందోనని
సాకులు వెతికానే గాని
నా పువ్వులు వాడిపోతున్నాయన్న
ధ్యాసే రాలేదు నాకు
ఇప్పుడు వణుకుతున్న ఆ పువ్వుల రూపంలో
జవాబులేని ప్రశ్నలే
కనిపిస్తున్నాయి
దేవుడా
నా పాపాలకు
ఆ పసిమొగ్గలను శిక్షించకు
No comments:
Post a Comment