అమ్మఒడి
గడియారంలో పెద్దముల్లు
పదిసార్లు కూడా గమ్యం
దాటలేదు
పట్టుమని పదినిమిషాలు
కూడా
గడవలేదు
అప్పుడే స్కూల్ నుంచి
వచ్చిన
చిన్నపిల్లాడిలా
ఆటలాడి అలసిన
పసివాడిలా
అమ్మ ఒడిలో
తల ఆనించాను
ఏవేవో భావాలు
ఎన్నెన్నో ఊసులు
మరెన్నో కథలు
ఇంకెన్నో గొడవలు
మనసుపొరల్లో
బొమ్మల్లా కదలాడాయి
అన్నీ చెప్పాలని
అనిపించింది
రోజూ ఆడుకునే దోస్తు
తిట్టాడని
చెప్పాలనిపించింది
పరుగులు తీయలేక
కిందపడి
మోచేతికి తగిలిన గాయం
చూపాలనిపించింది
పూదోటలో పుష్పం
కోయబోయి
చేతికి గుచ్చుకున్న
ముళ్ళు
చూపించాలనిపించింది
నేను చేసిన చిలిపి
పనులు
నేను చేసిన సరదాలు
ఎవరో పెట్టిన చివాట్లు
అన్నీ విడమర్చి
చెప్పాలనిపించింది
అమ్మతో మనసు
పంచుకోవాలనీ
అందరిపై చాడీలు
చెప్పాలనీ
మనసు ఉబలాటపడిపోయింది
నా కన్న బంగారం అని
అమ్మ నోట వినాలని
అనిపించింది
మనసుపొరల్లో చెలరేగిన
భావాలు
కన్నీటి పొరలుగా దూకి
వస్తుంటే
కష్టంగానైనా
అదిమిపెట్టుకున్నా
నా మౌనభాష
అమ్మమనసుకు చేరిందేమో
నా తల నిమురుతున్న
ఆ చేతి స్పర్శ
అన్నింటికీ
సమాధానం చెప్పేసింది
అవును
అమ్మ ఒడిలో నేను
ఎన్నటికీ
పసిబిడ్డనే
మనస్వినీ
No comments:
Post a Comment